ఇపుడీ విషయంపైనే జనాల్లోచర్చ జరుగుతోంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు తమ్ముళ్ళకు పిలుపునిచ్చారు. కానీ విచిత్రంగా తమ్ముళ్ళేమో చంద్రబాబు పిలుపునే బహిష్కరించారు. అంటే చంద్రబాబు ఆదేశాలను భిన్నంగా చాలా చోట్ల నేతలు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. చంద్రబాబు పిలుపుకు వ్యతిరేకంగా నేతలు ముందుకెళుతున్నారంటే అర్ధమేంటి ? చంద్రబాబు ఆదేశాలను పట్టించుకోలేదనే కదా. మరి ఇక ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా, పార్టీ అధినేతగా చంద్రబాబు ఆదేశాలకు ఏమి విలువున్నట్లు ? ఇపుడిదే విషయమై పార్టీలోనే కాదు జనాల్లో కూడా చర్చ జరుగుతోంది.
ఒకపుడు ఇష్టమున్నా లేకపోయినా నేతలు చంద్రబాబు మాటను జవదాటేవాళ్ళు కాదు. కానీ ఈమధ్య అంటే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు చంద్రబాబును చాలా లైటుగా తీసుకుంటున్నారు. తాజా పరిషత్ ఎన్నికల బహిష్కరణనే తీసుకుంటే నేతలు పట్టించుకోలేదు. వైజాగ్ జిల్లాలోని నర్సీపట్నం, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, పలాస, అనంతపురం జిల్లాలోని హిందుపురం, అనంతపురం, రాప్తాడు, కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, నంద్యాల, కోయిలకుంట్ల, చిత్తూరు జిల్లాలోని కుప్పం, చంద్రగిరి, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట లాంటి చోట్ల పోటీలో ఉన్న నేతల తరపున సీనియర్ నేతలే ప్రచారం చేస్తున్నారు. వీరుకాకుండా ఇంకా చాలామంది నేతలు తమ మద్దతుదారుల కోసం ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి చంద్రబాబు ఆదేశాలనే చాలామంది సీనియర్ నేతలు బహిష్కరించారు. పార్టీ బేస్ పటిష్టంగా ఉండాలంటే గ్రామ, మండలస్ధాయిలో పార్టీ బలంగా ఉండాలి. పార్టీ బలంగా ఉండాలంటే పంచాయితి, మండల, పరిషత్, మున్సిపాలిటి ఎన్నికల్లో పాల్గొంటేనే పటిష్టమైన నాయకత్వం తయారవుతుంది. పైగా స్ధానిక సంస్దల ఎన్నికల ద్వారా ఎంతోమంది గట్టి నేతలుగా తయారయ్యారు. ఈ వాస్తవాన్ని మరచిపోయిన చంద్రబాబు ఏదో సొల్లుచెప్పి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపివ్వటాన్ని చాలామంది సీనియర్లు అంగీకరించటంలేదు. ఈ విషయంలో చంద్రబాబును చాలామంది సీనియర్లు ఇప్పటికే నేరుగానే తప్పుపట్టారు. మరి ఇదే అంశం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకొస్తుందో చూడాల్సిందే.