ఒంటరి పోరాటమంటేనే చంద్రబాబునాయుడు భయపడిపోతున్నాడో తాజాగా జరిగిన ఓ పరిణామం చూస్తేనే అర్ధమైపోతుంది. పార్టీలోని ముగ్గురు సీనియర్లు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, పంచుమర్తి అనూరాధకు చంద్రబాబు ప్రత్యేకంగా బాధ్యతలప్పగించారు. వెంకన్న, అనూరాధకు పార్టీ పార్లమెంటు స్ధానాల్లో నేతల వివాదాలను పరిష్కరించటం, పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేయటమే బాధ్యతలు అప్పగించారు. అంతవరకు బాగానే ఉంది కానీ మాజీమంత్రి దేవినేనికి మాత్రం ఇతర పార్టీలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను అప్పగించటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో ఎవరితోను పొత్తు పెట్టుకోకుండా తెలుగుదేశంపార్టీ ఒంటరిగానే పోటీ చేసింది.
మొన్నటి ఎన్నికల నాటి పరిస్ధితులకు ఇప్పటికి ఏమీ మార్పులేదు. కాబట్టి టీడీపీకి మిత్రపక్షాలనేవి ఏవీ లేవు. మరి ఇతర పార్టీలతో సమన్వయం చేసుకునే పోస్టు దేవినేనికి ఎందుకు కట్టబెట్టినట్లు ? మిత్రపక్షాలుంటేనే కదా సమన్వయం చేసుకునే అవసరం వస్తుంది. మిత్రపక్షాలే లేనపుడు ఇక సమన్వయం అనే సమస్యే రాదు కదా. అయినా ప్రత్యేకంగా ఓ పోస్టు క్రియేట్ చేసినట్లు ? ఎందుకంటే ఒంటరి ఎన్నికలంటేనే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడో దీంతోనే అర్ధమైపోతోంది. టీడీపీ పగ్గాలు తీసుకున్న దగ్గర నుండి ఎవరితోను పొత్తు పెట్టుకోకుండా మొదటిసారి చంద్రబాబు పోటీచేసింది 2019లో మాత్రమే. మొదటి ఎన్నికలోనే చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించారు.
1982లో పార్టీ పెట్టినప్పటి నుండి ఎప్పుడూ ఎదురుకానంత ఘోర ఓటమి ఎదురయ్యింది. దాంతోనే చంద్రబాబు సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిపోయింది. పైగా మరో రెండేళ్ళల్లో జమిలి ఎన్నికలు వచ్చేయబోతున్నట్లు చంద్రబాబు పదే పదే జపం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినపుడు పొత్తులంటే ఎవరు కలవకపోవచ్చన్న అనుమానం ఉందేమో. అందుకనే ఇప్పటి నుండి ఇతర పార్టీలతో లైన్ కలపాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు దృష్టంతా ప్రధానంగా బీజేపీతో పొత్తుపైనే ఉంది. కానీ కమలంపార్టీ ఏమో దూరంగా పెట్టేస్తోంది. భవిష్యత్తులో ఏమవుతుందో ఏమో చెప్పలేం కానీ ఇప్పటికైతే బీజేపీ చంద్రబాబును దూరంగానే పెట్టేస్తోంది. ఇక వామపక్షాలేమైనా పొత్తుకు రెడీ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సీపీఐ తోకపార్టీ లాగ తయారైపోయింది. సీపీఎం మాత్రం డిస్టెన్స్ మైన్ టైన్ చేస్తోంది. బీజేపీ నుండి ఏ కారణం వల్లయినా జనసేన విడిపోతే అప్పుడది టీడీపీకి చేరవయ్యే అవకాశం ఉంది. ఇటువంటి కాంబినేషన్లను ఆలోచించుకున్న తర్వాతనే ఇతర పార్టీలతో సమన్వయం చేసుకోవటం అనే పోస్టును చంద్రబాబు క్రియేట్ చేసి దేవినేనికి అప్పగించారు.