‘పోలీసుల మీద తప్పుడు కేసులు పెట్టండి..వాళ్ళపై కేసులు పెట్టడం ద్వారా లొంగదీసుకుని కాళ్ళబేరానికి తెచ్చుకోండి’..ఇది చంద్రబాబు తమ్ముళ్ళకు చేసిన హితోపదేశం. ఐదేళ్ళ అధికారంలో చంద్రబాబునాయుడు అనుసరించిన విధానాలనే ఇపుడు వైసీపీ కూడా అనుసరిస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసీపీ నేతలను సతాయించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు చంద్రబాబు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇచ్చిన భరోసాతో జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు కూడా ఫాలోఅయిపోయారు. ఎక్కడబడితే అక్కడ వైసీపీ ఎంఎల్ఏలు, నేతలపై నానా రకాల కేసులు బనాయించారు. సందర్భం లేకపోయినా వాళ్ళని కేసుల్లో ఇరికించి మరీ జైళ్ళకు పంపారు. ఒక కేసులో బెయిల్ తీసుకుని బయటకు రాగానే వెంటనే మరోకేసులో ఇరికించి వెంటనే జైళ్ళకు పంపిన ఘటనలు చాలానే ఉన్నాయి.
చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళ విషయంలో అప్పట్లో చంద్రబాబు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఇక మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళపై ఎన్నో కేసులు పెట్టారు. వాళ్ళ కదలికలను తెలుసుకోవటానికి షాడో పార్టీలను ఏర్పాటు చేశారు. ఇదంతా అప్పట్లో ఇంటెలిజెన్స్ బాసుగా పనిచేసిన ఏబీ వెంకటశ్వేరరావు ఆదేశాల మేరకే జరిగిందని వైసీపీ ఎంఎల్ఏలు ఎన్నో ఆరోపణలు చేశారు. అప్పట్లో బహుశా జీవితాంతం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు అనుకునుంటారు. అందుకనే వైసీపీ ఎంఎల్ఏలు, నేతల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అప్పటి యాక్షన్ కే ఇప్పటి రాయిక్షన్ అన్న విషయం మరచిపోయి గోల చేస్తున్నారు.
పోలీసులపై తప్పుడు కేసులు పెట్టాలని, బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లొంగదీసుకుని కాళ్ళబేరానికి తీసుకొచ్చుకోవాలన్న సలహా ఆచరణ సాధ్యం అయ్యేది కాదన్న విషయం చంద్రబాబుకు తప్ప మిగిలినందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎవరు ఎవరిపైన అయినా కేసులు పెట్టాలంటే పోలీసు స్టేషన్ కు వెళ్ళాల్సిందే. అలాంటిది పోలీసులపైన ఎదరు కేసు ఎవరు పెట్టాలి ? పోలీసులు ఎందుకు నమోదుచేస్తారు ? ఇంతచిన్న విషయం కూడా చంద్రబాబు ఎలా మరచిపోయారో . పోనీ కోర్టుల్లో పోలీసులపై ప్రైవేటు కేసులు వేయాలంటే అదుకు సాక్ష్యాలు కావాలి కదా. సాక్ష్యాలు లేకుండా కేసులు వేస్తే నిలుస్తాయా ? ఒకవేళ కోర్టుల్లో పోలీసులకు వ్యతిరేకంగా కేసులు వేసినా తర్వాత ఆ నేతల పరిస్ధితి ఏమిటి ? వాళ్ళను పోలీసులు ఊరికే వదులుతారా ? ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇవ్వరు. పోలీసులదేముంది అధికారంలో ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తారు ? అయినా అప్పట్లో చంద్రబాబు నేర్పిన విద్యనే ఇపుడు వైసీపీ ఫాలోఅయిపోతోందంతే. ఇంతోటిదానికి చంద్రబాబు చింతించాల్సిన పనిలేదు.