పది సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నది వాస్తవం. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్ల అఖండ మెజారిటి వచ్చిందంటే మెజారిటి నియోజకవర్గాల్లో జగన్ బొమ్మను చూసే ఓట్లేశారన్నది వాస్తవం. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరి కష్టానికి గుర్తింపుగా పదవులు లభిస్తాయి. అలాగే మరికొందరు అదృష్టంతో పదవులు పొందుతారు. ఎవరికెలా పదవులు వచ్చినా వాళ్ళ పనితీరు జగన్ ఇమేజిని పెంచేదిగా ఉండాలే కానీ రోడ్డున పడేసేట్లుగా ఉండకూడదు. తాజాగా ఓ మహిళా నేత చేసిన నిర్వాకంతో పార్టీ నేతలే సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. గుంటూరుకు చెందిన వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ దేవళ్ళ రేవతి నడిరోడ్డుపై వేసిన వీరంగం చూసిన తర్వాత పార్టీ నేతలే విస్తుపోతున్నారు.
గుంటూరు నుండి విజయవాడకు బయలుదేరిన రేవతి మధ్యలో కాజా టోలుగేటు దగ్గర ఫీజు కట్టకుండానే వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే టోలుగేటు సిబ్బంది బ్యారికేడ్లు అడ్డుపెట్టి ఫీజు కట్టాల్సిందే అన్నారు. దాంతో ఆమె కారుదిగి రోడ్డుపై నానా గోల చేశారు. బ్యారికేడ్లను తోసేశారు. అడ్డొచ్చిన సిబ్బందిని పట్టుకుని కొట్టారు. ఇదంతా దేనికోసమయ్యా అంటే 100 రూపాయల ఫీజు కట్టే విషయంలోనే. ఛైర్ పర్సన్ అయిన తాను టోలుఫీజు కట్టడం ఏమిటి అనే విషయంలో రేవతికి ప్రిస్టేజ్ అడ్డొచ్చింది. దాంతో వాహనంలో నుండి దిగా నడిరోడ్డుపై తన ప్రతాపం చూపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఛైర్ పర్సన్ అయితే టోలుఫీజు కట్ట వద్దని ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. మరెందుకు రేవతి అంతలా వీరంగం వేసింది.
ఎందుకంటే ఛైర్ పర్సన్ గా అపాయింట్ కాగానే తనస్ధాయి ఒక్కసారిగా పెరిగిపోయిందని బహుశా ఆమె అనుకుంటున్నారేమో. ఒకవైపు పదేళ్ళు కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ ఏమో చాలా మర్యాదగా నడుచుకుంటుంటే నడమంత్రపు సిరి లాగ రేవతి లాంటి నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇటువంటి వాళ్ళను ఉపేక్షిస్తే జగన్ కే డేంజర్. రేవతి వీరంగాన్ని చూసిన తర్వాత వైసీపీలో సీనియర్ నేతలకే ఏమి మాట్లాడాలో అర్ధం కావటం లేదట. ఇక సోషల్ మీడియాలో అయితే ఛైర్ పర్సన్ పై మండిపోతు పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఎలాగూ టోలుగేటు సిబ్బంది రేవతిపై మంగళగిరి పోలీస్టేషన్లో కేసు పెట్టారు. కేసు విషయం ఏమిటో తేలితే తర్వాత జగన్ ఏమి చేస్తారో చూడాలి.