హెరాల్డ్ ఎడిటోరియల్ : కేసీయార్ లో పెరిగిపోతున్న టెన్షన్

Vijaya
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ ప్రధానపార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మిగిలిన పార్టీల సంగతి ఎలాగున్నా కేసీయార్ లో మాత్రం టెన్షన్ పెరిగిపోతోందన్నది వాస్తవం. ఎందుకంటే ఈ ఎన్నికలు కేసీయార్ సామర్ధ్యానికే పరీక్షగా నిలవబోతోంది. మిగిలిన పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఒకటే. కానీ టీఆర్ఎస్ పరిస్ధితి అలాకాదు. పోయిన ఎన్నికల్లో గెలిచిన 99 డివిజన్ల కన్నా ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ గెలిస్తేనే కేసీయార్ ప్రిస్టేజి నిలుస్తుంది. ఎక్కువ సీట్లు గెలవకపోయినా కనీసం అప్పట్లో గెలిచిన 99 సీట్లనయినా నిలుపుకోకపోతే పరువు పోవటం ఖాయం. అందుకనే టీఆర్ఎస్ నేతలు ఇంతగా పోరాటాలు చేస్తున్నది. కనీసం 99 సీట్లలో గెలవకపోతే కేసీయార్ మంత్రివర్గ ప్రక్షాళన పేరుతో ఎంతమందిని తొలగించేస్తారో కూడా ఎవరికీ తెలీటం లేదు. ఎందుకంటే డివిజిన్లలో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించే బాధ్యత మంత్రులపైనే పెట్టారు కాబట్టి.



అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. ప్రచారానికి వస్తున్న మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు అభ్యర్ధులపై కూడా జనాలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. పోయిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయటంతో పాటు మొన్నటి భారీ వర్షాలకు జరిగిన డ్యామేజిపై మండిపోతున్నారు. మొన్నటి భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని కొన్ని వందల కాలనీలు నీటి ముణిగిపోయాయి. వేలాది మంది తమ ఇళ్ళను వదిలేసి రోజుల తరబడి బయట ఇళ్ళల్లో తలదాచుకున్నారు. నీళ్ళల్లో ముణిగిపోయిన ఇళ్ళను పరిశీలించటానికి కానీ జనాలను పరామర్శించటానికి కానీ అధికారపార్టీ నేతలు కానీ ఉన్నతాధికారులు కానీ ఎక్కడా కనబడలేదు. అలాంటిది ఎన్నికలంటే మాత్రం మంత్రులతో సహా ప్రజా ప్రతినిధులంతా వచ్చేసి జనాలను కలుస్తున్నారు. దాంతో ఒళ్ళు మండిపోయిన జనాలు తిరగబడుతున్నారు. దాంతో ప్రచారాన్ని మధ్యలోనే నిలిపేసి టీఆర్ఎస్ నేతలు వెళ్ళిపోతున్నారు.



కేసీయార్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందనటానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. వీళ్ళ వ్యతిరేకత ఇలాగుంటే ప్రతిపక్షాలు ప్రధానంగా బీజేపీ నేతల మాటల దాడులు మరింతగా కలవరపరుస్తోందనే చెప్పాలి. కేసీయార్, ఎంఐఎం పార్టీల బంధాన్ని జనాల్లో బాగా కమలం నేతలు ఎండగడుతున్నారు. దాని ఫలితంగా ఆరేళ్ళ తమ పాలనలో జరిగిన అభివృద్దిని చెప్పుకోవాల్సిన టీఆర్ఎస్ నేతలు ఎంతసేపు బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పుకోవటానికి సమయాన్ని కేటాయించాల్సొస్తోంది. ఇఫ్పటికిప్పుడు బీజేపీ గ్రేటన్ పీఠాన్ని గెలిచేస్తుందని అనుకునేందుకు లేదు. అయితే టీఆర్ఎస్ విజయాన్ని ఎన్ని డివిజన్లకు తగ్గిస్తుందన్నదే కీలకమైంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఎన్ని డివిజన్లను కోల్పోతే జనాల్లో అంత వ్యతిరేకత పెరిగిపోతోందన్నది అంచనా వేయచ్చు. జీహెచ్ఎంసి ఎన్నికలంటేనే మినీ తెలంగాణా అని పేరు. తెలంగాణాలోని అన్నీ జిల్లాలకు చెందిన జనాలు హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి రేపటి ఎన్నికల్లో ఇదే స్పందన రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: