హెరాల్డ్ ఎడిటోరియల్ : కేంద్ర సంస్ధలకు రాష్ట్రాలు ఎదురు తిరుగుతున్నాయా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎంట్రీని నిరోధిస్తు కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అధ్యక్షతన జరిగిన కేరళ మంత్రిమండలి రాష్ట్రంలోకి సీబీఐ, ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రని నిషేధిస్తు నిర్ణయించటం సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే విచారణలో ఉన్న కేసులను మాత్రం సీబీఐ, ఈడీ కంటిన్యు చేయవచ్చని డిసైడ్ చేసింది క్యాబినెట్. దుబాయ్ లోని విదేశీ రాయబార కార్యాలయం ద్వారా కేరళకు బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసుకున్న కేసును ఇప్పటికే సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీటితో పాటు విచారణలో ఉన్న మరికొన్ని కేసులను మాత్రమే సీబీఐ చూడగలుతుంది. ఇవి మినహా ఇంకే కేసులకూ పై దర్యాప్తు సంస్ధలకు నో ఎంట్రో బోర్డు పెట్టేసింది కేరళ ప్రభుత్వం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటికే పశ్చిమబెంగాల్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రాలు కూడా సీబీఐ ఎంట్రికి నో చెప్పేశాయి. గతంలో అంటే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు సీబీఐ ఎంట్రీని అడ్డుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత సీబీఐ ఎంట్రీపై ఉన్న బ్యాన్ ను ఎత్తేశారు. చూడబోతే ఎన్డీయే యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీబీఐ లేకపోతే ఈడీ ఎంట్రీలను అడ్డుకోవటం ఎక్కువైపోతోంది. ఎందుకంటే తన ఆధీనంలో ఉండే దర్యాప్తు సంస్ధలను ఉపయోగించుకుని ప్రత్యర్ధులపై కేంద్రప్రభుత్వం కేసులు బనాయిస్తోందంటూ ఎప్పటి నుండో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆరోపణలు ఇప్పటివి కాదు కనీసం 25 సంవత్సరాలుగా జనాలు వింటునే ఉన్నారు. రాజకీయ ప్రత్యర్ధుల ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలు కూడా నడుచుకుంటున్నాయి.
ఇక్కడ చిన్న ఉదాహరణ తీసుకుంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆ పార్టీ ఎంపిలు సుజనాచౌదరి, సిఎం రమేష్ లాంటి వాళ్ళ ఇళ్ళు, ఆఫీసులపై సీబీఐ, ఈడీ అధికారులు పదే పదే దాడులు చేశారు. కీలకమైన రికార్డులు, ఫైళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజో రేపో వాళ్ళ అరెస్టు ఖాయమని అనుకుంటున్న సమయంలో సీబీఐ ఎంట్రీని అడ్డుకుంటు చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే విచారణలో ఉన్న కేసుల్లో ఎంపిలను అదుపులోకి తీసుకోవటమే లేకపోతే అరెస్టు చేయటమో చేయొచ్చు. కానీ అలాంటిదేమీ జరగలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. ముందుజాగ్రత్తగా సుజనా, సీఎం రమేష్ తో పాటు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపిలు బీజేపీలో చేరిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళపై సీబీఐ, ఈడీ దాడులు జరపలేదు, కేసులు నమోదు చేసి అరెస్టులూ చేయలేదు.
అంటే ఏమిటర్ధం ? తప్పులు చేసిన వాళ్ళు, ఆర్ధిక అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే తమ పార్టీలో చేరిపోతే వాళ్ళపై ఎటువంటి చర్యలు ఉండవని తేలిపోయింది. ఇటువంటి వైఖరినే రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమపై కక్షసాధించటం కోసమే సీబీఐ, ఈడీలను కేంద్రప్రభుత్వం వాడుకుంటోందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందనే అభిప్రాయం పెరిగిపోతోంది. అంతకుముందు యూపీఏ హయాంలో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన కారణంగానే జగన్ పై కేసులు, విచారణలు, అరెస్టులు జరిగినట్లు స్వయంగా అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న గులాం నబీ ఆజాదే వ్యాఖ్యానించారంటే ఆరోపణలు ఆరోపణలు మాత్రమే కాదని అర్ధమైపోతోంది. ఇప్పటికే సీబీఐ ఎంట్రీని నాలుగు రాష్ట్రాలు అడ్డుకున్నాయి. మరి భవిష్యత్తులో ఇంకెన్ని రాష్ట్రాలు అడ్డుకుంటాయో చూడాలి. ఏదేమైనా కేంద్ర వైఖరిపై రాష్ట్రాలు తిరగబడుతున్నట్లుగానే ఉంది చూస్తుంటే.