ఎడిటోరియల్ : ఇక కష్టమేనా ! జూమ్ రాజకీయం తలనొప్పేనా ?

పార్టీకి ఏదో రకంగా పునర్వైభవం తీసుకువచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఈ వయస్సులో విశ్రాంతి తీసుకునే పరిస్థితి వచ్చినా, బాబు మాత్రం ఎక్కడా అలా చేయడం లేదు. తన ఆరోగ్యాన్ని సైతం పక్కనపెట్టి మరీ, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో, మొన్నటి వరకు హైదరాబాదులోని తన నివాసానికే పరిమితమైపోయినా, ఏపీలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, నాయకులు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, అధికారపార్టీ వేధింపులు పెరిగిపోతుండటం, పెద్దఎత్తున నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న ఈ పరిణామాలన్నింటినీ లెక్కలు వేసుకున్న బాబు అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి అమరావతి కి వచ్చేసారు. ఇక్కడికి వచ్చినా, బాబు మాత్రం ఎక్కడా జనాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటం లేదు.


కనీసం తనను కలిసేందుకు వస్తున్న నాయకులు ఎవరికి అపాయింట్మెంట్ సైతం ఇవ్వడం లేదు. హైదరాబాదులో ఏ విధంగా అయితే జూమ్ యాప్ ద్వారా, అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. ప్రస్తుతం అమరావతి నుంచి కూడా అదే అదే జూమ్ యాప్ ద్వారా నాయకులు, మీడియాతో మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని మరింత హీట్ పుట్టించే విధంగా చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు పదే పదే పిలుపునిస్తూ అమరావతి ఉద్యమంలో పాల్గొనాలని, మీడియా సమావేశాలు నిర్వహించాలని కొవ్వొత్తుల ర్యాలీలు చేసి రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఇలా ఎన్నో రకాలుగా ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.


 అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరిలో లోకేష్ పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే. లోకేష్ పోటీ చేసి ఓటమి చెందినా, మళ్ళీ అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉండడంతో, లోకేష్ అమరావతి కోసం ఎందుకు ఉద్యమం చేయడం లేదని, అసలు ఇల్లు దాటి బయటకు ఎందుకు రావడం లేదనే ప్రశ్న ఇప్పుడు టిడిపి క్యాడర్ లో ఉంది. పార్టీని బతికించుకోవడం కోసం ఈ వయసులో చంద్రబాబు ఇల్లు దాటి బయటకు వచ్చినా, లోకేష్ ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నారని, మేము రోడ్ల మీదకు వచ్చి కేసులు ఎదుర్కొంటే, లోకేష్ హాయిగా అధికారం అనుభవించేందుకు వస్తాడా అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.


ప్రస్తుతం జూమ్ రాజకీయాలు చేస్తూ, పార్టీ కేడర్ లో ఉత్సాహం తీసుకువద్దామని ప్రయత్నిస్తున్నా, నాయకుల్లో మాత్రం ఎక్కడా కదలిక వస్తున్నట్లుగా కనిపించడం లేదు. ముందు ముందు కూడా చంద్రబాబు ప్రత్యక్షంగా జనాల్లోకి వచ్చి పోరాడే అవకాశం కనిపించడం లేదు. కానీ ఎక్కువ కాలం జూమ్ ద్వారా రాజకీయాలు చేద్దామంటే పార్టీని సమర్ధవంతంగా ముందుకు నడిపించే పరిస్థితి ఉండదు.


 ఒకవైపు అధికార పార్టీ వైసీపీ వెళ్తున్న స్పీడును వైసిపి అందుకోలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో టిడిపి రాజకీయ భవిష్యత్తు పై అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఈ సమయంలో లోకేష్ యాక్టివ్ అయ్యి తన ప్రతిభను నిరూపించుకుంటారా అంటే, ఆయన మరి రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతుండటం, పార్టీ శ్రేణులకు అసంతృప్తిని మిగులుతోంది. లోకేష్ కూడా జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడకుండా, మొదటి నుంచి సోషల్ మీడియా ద్వారానే రాజకీయాలను శాసిద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇవన్నీ టీడీపీకి ఎన్నో ప్రతికూల అంశాలుగా మారినట్టుగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: