హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనాతో వణికిపోతున్న పార్లమెంటు..ఇంతమందికి వైరస్ సోకిందా ?
కరోనా వైరస్ భయంతో పార్లమెంటు వణికిపోతోంది. సోమవారం నుండి వర్షాకాల సమావేశాలు మొదలవ్వనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేది వరకు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యిందో అప్పటి నుండే లోక్ సభ స్పీకర్ తో పాటు రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రమంత్రులు, ఎంపిలందరికీ కరోనా వైరస్ నిర్ధారిత టెస్టులు చేయటం, మొత్తం పార్లమెంటును శానిటైజ్ చేయటం, మంత్రులు, ఎంపిలు ప్రవేశించే దారిని శానిటైజ్ చేయటం అయిపోయింది. పనిలో పనిగా కేంద్రమంత్రులు, ఎంపిలు+వాళ్ళ వ్యక్తిగత సిబ్బందితో పాటు పార్లమెంటు ఉభయ సభల ఉన్నతాధికారులు, సిబ్బంది, జర్నలిస్టులను కూడా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రమంత్రులు, ఎంపిలకు వైరస్ నిర్ధారిత పరీక్షలు అయిపోయాయి. అయితే 24 మంది ఎంపిలు, 8మంది కేంద్రమంత్రులకు కరోనా వైరస్ సోకినట్లు బయటపడింది. ఇప్పటికే సుమారు ఐదుగురు కేంద్రమంత్రుల అమిత్ షాతో కలిసపి కరోనా వైరస్ సోకటంతో ఐసొలేషన్లో ఉన్నారు. చాలామంది ఎంపిలు కూడా ఇదే పరిస్ధితిలో ఉన్నారు. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయ్యే ముందు పలువురు కేంద్రమంత్రులు, ఎంపిలకు వైరస్ సోకిందని నిర్ధారణ అవ్వటంతో పార్లమెంటు సెక్రటేరియట్ ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది.
సమావేశాలు జరుగుతున్న సమయంలో కేంద్రమంత్రులు, ఎంపిల్లో ఎవరికైనా వైరస్ సోకిందని బయటపడితే తమ గతేమి కానంటూ చాలామందిలో ఆందోళన పెరిగిపోతోందట. మార్చిలో కరోనా వైరస్ బయటపడినపుడు కూడా ఇలాగే సమావేశాలు జరుగుతున్నాయి. అప్పుడు కూడా కొందరు ఎంపిలకు వైరస్ సోకిందని తేలగానే మిగిలిన వారిలో టెన్షన్ పెరిగిపోయింది. దాంతో అప్పటికప్పుడు పార్లమెంటు సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. మళ్ళీ అప్పటి నుండి పార్లమెంటు సమావేశాల నిర్వహణపై ప్రయత్నాలు జరిగినా సక్సెస్ కాలేదు. చివరకు జూమ్ అప్లికేషన్ పద్దతిలో అయినా సమావేశాలు నిర్వహిద్దామని కేంద్రం అనుకున్నా సాధ్యం కాదని తేలటంతో ప్రయత్నాలను మానుకుంది.
మళ్ళీ ఇంతకాలానికి అన్నీ జాగ్రత్తలను తీసుకుని పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే అందరికీ కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు కూడా చేయించింది. తాజా కబురు ప్రకారం కేంద్రమంత్రులు+ఎంపిలు కలిపి దాదాపు 40 మందికి వైరస్ సోకిందని తేలటంతో ఏమి చేయాలో కేంద్రప్రభుత్వానికి అర్ధం కావటం లేదు. పరీక్షలు చేయించుకున్న వారిలో ఇంకా ఎంతమంది రిజల్ట్స్ రావాలో తెలీదు. ఇపుడు నెగిటివ్ వచ్చినా మళ్ళీ పాజిటివ్ రాదని గ్యారెంటీ కూడా లేదు కదా అంటూ బిజెపి ఎంపిలే భయపడుతున్నారట. మరి తాజా సమాచారం వల్ల పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే.