ఆపరేషన్ కుప్పం : చంద్రబాబు గడ్డపై జగన్ జెండా ఎగురుతుందా..?

Sunil Medarametla

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్సార్సీపీ మరో షాక్ ఇవ్వబోతుందా..? చంద్రబాబు టార్గెట్ గా కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టిందా..? ఇందుకోసం రంగంలోకి దిగిన ఆ కీలక నేత ఎవరు..? రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కష్టమేనా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచు కోట. ఆయన ఏడుసార్లుగా అక్కడి నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. 1989 నుంచి 2019 వరకూ వరసగా జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుదే విజయం. గత ఎన్నికల్లో చంద్రబాబుపై వైఎస్సార్సీపీ తరుపున రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి రంగంలో దిగారు. ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాధించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందడం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ, కుప్పంలో పాగా వేసేందుకు మాత్రం అవకాశం దొరకలేదు. దీంతో ఇప్పుడు కుప్పంపై వైఎస్సార్సీపీ ఫోకస్ చేసింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడిచిన దాదాపు 14 నెలల తర్వాత వైఎస్సార్సీపీ అధిష్టానం కుప్పం నియోజకవర్గం పై దృష్టిసారించింది.

 

ఎన్నికల అనంతరం అనూహ్య పరిణామాల నేపథ్యంలో లో దివంగత నేత చంద్రమౌళి కుమారుడు భరత్ కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి పెద్దదిక్కు అయ్యారు. ఈయన నియోజకవర్గంలో ప్రభుత్వ , పార్టీ కార్యక్రమాలలో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. అలాగే కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ చైర్మన్ సెంథిల్ కుమార్ తో కలిసి ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యులను గ్రామస్థాయిలో ఉన్న నాయకులను కార్యకర్తలను వైఎస్సార్సీపీలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

 

మరో ఏడాది కాలంలో అత్యధిక శాతం ముఖ్యులైన టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీలోకి తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో కుప్పంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి వ్యూహాత్మక రచన కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. మొదటగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో, పంచాయితీలలో పట్టు సాధించాలని వ్యూహ రచన చేస్తున్నారు. దీని ద్వారా 2024 ఎన్నికల్లో కుప్పంలో పాగా వేసేందుకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటినుంచే అమలు చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: