ఆ వైసీపీ నేతా మ‌జాకా... ఒక్క ఫోన్‌కాల్ దెబ్బ‌కు మైండ్ బ్లాకే...!

VUYYURU SUBHASH

వైఎస్సార్‌సీపీ రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌వ‌క‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు ముదిరిపోతున్నాయి. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యార‌వుతోంది. అండ‌గా నిల‌వాల్సిన ఒక‌రికొక‌రు వెన్నుపోట్ల‌కు దిగుతున్నారు. కాంగ్రెస్ నేప‌థ్యం ఉన్న నేత‌లే ఎక్కువ‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ నేత‌లు పైకి బాగానే ఉంటున్న కోల్డ్ వార్ మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ఆకుల వీర్రాజుకు వ్య‌తిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి అస‌మ్మ‌తిని రాజేయాల‌ని కొంత‌మంది నేత‌లు చూశారు. ఇందుకు సంబంధించిన ర‌హ‌స్య‌భేటీలు కూడా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. అయితే మ‌రునాడు ప్రెస్‌మీట్ పెట్టాల‌ని చూస్తున్న స‌మ‌యంలోనే స‌ద‌రు గ్రూప్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న నేత‌ల‌కు అధిష్ఠానం పెద్ద‌ల నుంచి ఫోన్లు వెళ్లాయి.

 

ఆగ‌డాలు ఎక్కువ‌వుతున్నాయ్‌..త‌గ్గించుకుంటే మంచిద‌ని హెచ్చ‌రిక‌లు వెళ్లాయి. ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే తాము చేయాల్సింది చేస్తామ‌ని ఫోన్‌లోనే త‌లంటు పోయ‌డం గ‌మ‌నార్హం. ఫోన్‌లోనే విష‌యం తీవ్ర‌త అర్థ‌మైన స‌ద‌రు నేత‌ల‌కు...దెబ్బ‌కు మైండ్ బ్లాక్‌, రెడ్‌, గ్రీన్ ఇలా అన్ని రంగులు మారిపోయి..భ్ర‌మ‌ల మ‌త్తు వ‌దిలింది. ప్రెస్‌మీట్‌లో అస‌మ్మ‌తికి బ‌దులుగా పార్టీ నేత‌ల్లో ఐక్య‌త రాగం వినిపించ‌డ‌మే కాకుండా ప్రస్తుత ఇన్ ఛార్జ్ సూపర్ అంటూ టిడిపి రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే అసమర్థుడంటూ ఆయనపైకి తిరగడం చర్చనీయం అయ్యింది.

 

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఆకుల వీర్రాజు రెండుసార్లు పోటీలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఈ రెండు సార్లు కూడా టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రే విజ‌యం సాధించారు. ఈ రెండు సార్లు పార్టీలో టికెట్ ఆశించిన వారే వెన్నుపోటు కారణమని ఆయన అధిష్టానానికి ఇచ్చిన నివేదికలో గతంలోనే పేర్కొన్నారు. 2014 లో 20000 వేల ఓట్ల మెజారిటీ, రెండోసారి 10 వేల ఓట్ల తేడాతో గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఓటమి పాలయ్యారు. ఈ ఓటములకు సొంత పార్టీ నేత‌లే కార‌ణం అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

 

అయితే  రాజమండ్రి రూరల్ నుంచి బలంగా ఉన్న టీడీపీ నేత‌ల‌ను పార్టీలోకి తీసుకువ‌చ్చేందుకు ఇటీవ‌ల ఆకుల వీర్రాజు గ‌ట్టిప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. అయితే పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న కృషి చేస్తుంటే సొంత పార్టీ వారే చుక్కలు చూపించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: