రాజు గారు “యూ టర్న్” తీసుకున్నట్టేనా..?

Sunil Medarametla

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గత కొద్ది రోజులుగా సొంత పార్టీకి మేకులా మారిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ ఎంపీలు, పలువురు ముఖ్య నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి.. తమ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా రఘురామపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా అరెస్టు తప్పదని వార్తలు రావడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

 

అయితే తాజాగా ఇటీవలే మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణం రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పార్టీకి, ప్రభుత్వానికి చాలా తేడా ఉందని నేనెప్పుడూ మా పార్టీకి కానీ, పార్టీ అధ్యక్షుడికి కానీ ఒక సలహా కూడా ఇవ్వలేదని అన్నాడు. పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని, తాను ప్రభుత్వానికి మాత్రమే కొన్ని సూచనలు ఇచ్చానని అన్నాడు. తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాల గురుంచి మాత్రమే నేను మాట్లాడనని వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలనే తన తరుపున ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చానని చెప్పుకొచ్చాడు.

 

మా పార్టీకి, నాకు మధ్య కొంతమేరకు మీడియానే చిచ్చు పెడుతుందని దయచేసి అది మానుకోమని అన్నారు. నాకు మా పార్టీకి ఎలాంటి విబేధాలు లేవని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు చూసిన కొందరు రాజకీయ విశ్లేషకులు, రఘురామకృష్ణం రాజు యూ టర్న్ తీసుకున్నట్టు చెప్తున్నారు. మరికొందరు మాత్రం చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రఘురామకృష్ణంరాజు స్ట్రాటజీ అని.. ఆయన త్వరలోనే మరో బాంబ్ పేల్చబోతున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసాయి. మరి రానున్న రోజుల్లో రఘురామకృష్ణంరాజు అడుగులు ఎలా ఉండబోతున్నాయో అన్నదే ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: