రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి స్పెషల్ స్టోరీ...!
సామాజిక సమానత్వం కోసం పోరాటం చేసిన అలుపెరుగని ఉద్యమకారుడు బీఆర్ అంబేద్కర్. ఆయన జీవితమే ఓ పోరాటం. అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ లో తక్కువ కులంగా ముద్ర పడిన మహర్ కులంలో పుట్టారు. చిన్న వయస్సులోనే అంబేద్కర్ కు రమాబాయితో పెళ్లైంది. పెళ్లి తరువాత కూడా చదువును కొనసాగించిన అంబేద్కర్ 1907లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. బొంబాయి యూనివర్సిటీ నుంచి 1912లో ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ సాధించారు.
1915లో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఎ డిగ్రీ, 1916లో పిహెచ్‌డి విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంబేద్కర్ బాల్యంలోనే అగ్ర కులాల నుంచి ఆధిపత్య పోరును ఎదుర్కొన్నారు. పాఠశాలలో తనకు ఎదురైన హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు. న్యాయశాస్త్రంలో పిహెచ్‌డి పూర్తి చేసిన అంబేద్కర్ అమెరికాలో నల్లవారిపై శ్వేత వర్ణాల వివక్షను సహించలేకపోయారు. బారిష్టర్ పూర్తి చేసి ఇండియాకు వచ్చిన తరువాత అంబేద్కర్ దళితుల సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.
బహిష్కృత హితకారిణి అనే సంస్థను స్థాపించి అంబేద్కర్ అస్పృశ్యతపై అలుపెరుగని పోరాటం చేశారు. మనుషులందరి రక్తం ఒకే రంగులో ఉంటుందని అలాంటప్పుడు అంటరానితనం ఎందుకని అంబేద్కర్ ప్రశ్నించారు. అనంతరం అంబేద్కర్ మహారాజుగారి మిలటరీ కార్యదర్శిగా బరోడా సంస్థానంలో పని చేశారు. మహారాజు సహకారంతో అంబేద్కర్ ముఖనాయక్ అనే పక్ష పత్రికకు సంపాదకత్వం బాధ్యతలు స్వీకరించారు.
మహత్ చెరువులోని నీటిని తాగడానికి దళితులకు అనుమతి లభించకపోతే అంబేద్కర్ వాళ్ల మీద ఉన్న బ్యాన్ ను ఎదురించి నీళ్లు తాగేలా చేశారు. కులాన్ని పెంచి పోషిస్తున్న హిందూ మతాన్ని తాను వదిలేస్తుననని చెప్పి అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి ముంబాయి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసిన అంబేద్కర్ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో చేరి దళితుల వాయిస్ వినిపించారు.
అంబేద్కర్ దేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. రాజ్యాంగ రచన బాధ్యతలు స్వీకరించి ఉద్యోగాల్లో, చదువుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని పట్టు బట్టి సాధించారు. అంబేద్కర్ అనేక రాజ్యాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి ఒక స్థిరమైన, దృఢమైన రాజ్యాంగాన్ని, భరతమాతకు బహుమానంగా అందించారు. 1956 సంవత్సరం డిసెంబర్ 6న అంబేద్కర్ తుది శ్వాస విడిచారు.