జాతరలో రచ్చ.. పవన్ ఫ్యాన్స్ vs ఎన్టీఆర్ ఫ్యాన్స్..

Satvika
పండగలు, జాతరలు, తిరునాళ్ళు అంటే అందరి దృష్టి గ్రామాల వైపే ఉంటుంది.. ఆ సమయంలో పల్లె అందాలను చూడటం కోసం ఎక్కడేక్కడి నుంచో అందరు వస్తాయి.ఒక్కొక్కసారి కొందరు ఆకతాయి చేసే పనుల కారణంగా గ్రామస్తులు అంతా ఇబ్బందులకు గురి అవుతుంటారు. తాజాగా పండుగ రోజున ఆర్కేస్ట్రా పెట్టుకుని గ్రామస్తులు అంతా ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ గ్రామంలో కొందరు ఆకతాయిలు చేసిన పనికి గ్రామస్తులు అంతా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.


అసలు విషయానికొస్తే..చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కైగల్ గ్రామంలో ఏళ్ల తరబడి గంగమ్మ జాతరను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. బయట ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు కూడా గంగమ్మ జాతరకు సొంత గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా గ్రామంలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు అంతా తీర్మానం చేసుకుని, చందాలు వేసుకుని జాతరకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలోని కొందరు యువకుల కోరిక మేరకు ఈ ఏడాది ఆర్కేస్ట్రా పెట్టాలని భావించిన గ్రామస్తులు అనుకున్న విధంగా శనివారం గ్రామంలోని ఏడు ప్రాంతాల్లో వెలసిన గంగమ్మ ఆలయాలు ఉండగా, అందులో నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు, వినోద కార్యక్రమం అనంతరం మరో మూడు ఆలయాల్లో పొంగళ్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంది.


బయట ప్రాంతం నుంచి విచ్చేసిన ఆర్కేస్ట్రా సభ్యులు గ్రామస్తులు కోరిన సినిమా పాటకు డ్యాన్స్ లు చేశారు. అంతవరకూ సాఫీగా సాగిన ఆర్కేస్ట్రాలో ఒక్కసారిగా గొడవ మొదలైంది. గ్రామంలోని కొందరు ఎన్టీఆర్ పాటలు అని మరి కొందరు పవన్ కల్యాణ్ పాటలు అలా కాదు ప్రభాస్ పాటలు వేయాలని ఆర్కేస్ట్రా దారులను ఇబ్బంది పెట్టసాగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ పాటకు డాన్స్ వేశారు ఆర్కేస్ట్రా సభ్యులు. దీంతో ఆగ్రహించిన కొందరు యువకులు ఆర్కేస్ట్రా నిర్వాహకులతో గొడవకు దిగ్గి కుర్చీలను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. యువకులు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఊరందరినీ పోలీస్ స్టేషనుకు తరలించారు. గొడవకు కారణం అయిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: