24 గంటల్లో పెళ్లి.. ఇంతలో యువతి ఏం చేసిందంటే?
మరో 24 గంటల్లో ఆ యువతి పెళ్లి పీటలపై కూర్చోడానికి సిద్ధమైంది. దీంతో ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు. కానీ అంతలో ఊహించని ఘటన. యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ యువకుడి వేధింపులతో కారణంగానే ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది అని తెలుస్తోంది. దీంతో అప్పటి వరకు సందడి వాతావరణం నెలకొన్న పెళ్లి ఇంట్లో విషాదం అలుముకుంది. కూతురు దూరం కావడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. ఇక ఈ విషాదకర ఘటన నారాయణపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మక్తల్ పురపాలక పరిధిలోని చంద్రపూర్ కు చెందిన పద్మ, వెంకట్ దంపతులకు రెండో కుమార్తె భీమేశ్వరి ఉంది.
ఆమెకు అదే పురపాలక పరిధిలోనే దండు గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల కిందట వివాహం నిశ్చయించారు. నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ఇక అంత పెళ్లి సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నిద్రలేచి చూసిన కుటుంబ సభ్యులకు భీమేశ్వరి ఇంట్లో చున్నీతో ఉరి వేసుకున్నట్లు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. పక్కనే సూసైడ్ నోట్ కూడా లభించింది.తన నిశ్చితార్థం అయిన చంద్రాపూర్ కు చెందిన లిక్కి అలియాస్ నరసింహులు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.