ఓరి నాయనో.. కన్నతండ్రే ఇలా చేస్తే ఎలా?

praveen
అతను ఒక న్యాయవాది.. పదిమందికి న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరీ విషయంలో ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు. పరాయి వాళ్ళ విషయంలోనే అంత గొప్పగా ఆలోచించే న్యాయవాది ఇక సొంత కొడుకు విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సభ్య సమాజంలో ఉన్న విలువలు అన్నింటిని కూడా నేర్పిస్తూ ఇక ఎంతో ఓపికగా మంచిచెడులు నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ న్యాయవాది అయిన తండ్రి మాత్రం ఏకంగా తన పదేళ్ళ కొడుకు ని చిత్రహింసలకు గురి చేశాడు. కంటికి రెప్పలా కాపాడుకొని రక్షణ కవచంగా నిలవాల్సిన తండ్రి చివరికి కొడుకు పాలిట రాక్షసుడు గా మారిపోయాడు.



 భార్యతో గొడవ కారణంగా వేరుపడిన సదరు న్యాయవాది భార్యను ఏమీ చేయలేక చివరికి ఆ కోపాన్ని కుమారుడిపై చూపించాడు. ఈ దారుణమైన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. డాక్టర్ కాలనీకి చెందిన న్యాయవాది దేవులపల్లి సంతోష్ కుమార్ కు ఉమామహేశ్వరి తో పెళ్లి జరిగింది.. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇక నాలుగేళ్ల క్రితం భార్యతో గొడవలు కారణంగా వేరు పడ్డాడు న్యాయవాది సంతోష్ కుమార్. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవల నాలుగు నెలల క్రితమే ఇద్దరు పిల్లలను కూడా తండ్రికి అప్పగించింది తల్లి. అప్పటినుంచి భార్య పైన కోపాన్ని పదేళ్ల వయసున్న కుమారుడుపై చూపించడం మొదలు పెట్టాడు.


 తండ్రి చిత్రహింసలు భరించలేని బాలుడు చివరికి పారిపోయి తల్లి వద్దకు చేరుకున్నాడు. అయితే కొడుకు ఒంటి పై తీవ్ర గాయాలు ఉండడం చూసిన తల్లి మహేశ్వరి తల్లడిల్లిపోయింది. ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీసింది. ఈక్రమంలోనే ఇక తన భర్త సంతోష్ కుమార్ చిత్రహింసలకు గురి చేశాడు అనే విషయం తెలుసుకుని షాక్ అయింది. వెంటనే బాలుడిని తీసుకుని  పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: