
పాపం పోనీలే అని సహాయం చేశారో.. ఇక జైలుకే?
ఇటీవలే భద్రాచలం నుండి హైదరాబాద్ బయల్దేరాడు నరేష్ అనే యువకుడు. అదే బస్సులో ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు. సరిగా డ్రైవర్ బస్సు స్టార్ట్ చేస్తున్న సమయంలో ఆ వృద్ధుడికి ఒక ఫోన్ వచ్చింది. ఇక అర్జెంటుగా ఇంటికి రావాలంటూ ఫోన్లో అవతల వ్యక్తి తెలిపాడు. దీంతో పక్కనే ఉన్న నరేష్ దగ్గరికి వెళ్లిన ఆ వృద్ధుడు ఏమి అనుకోకపోతే ఈ సంచి హైదరాబాద్ లో ఇవ్వు.. నువ్వు బస్సు దిగగానే మా వాడు వచ్చి తీసుకుంటాడు అంటూ నమ్మబలికాడు. ఇక పోనీలే పెద్దాయన కదా అని మానవత్వాన్ని చాటుకున్నాడు నరేష్. కట్ చేస్తే మార్గమధ్యంలో పోలీసులు వచ్చి బస్సులో తనిఖీలు చేయగా ఇక వృద్ధుడు ఇచ్చిన బ్యాగులో ఐదు కిలోల గంజాయి బయటపడింది. చివరికి నరేష్ ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు..
కేవలం ఇక్కడే కాదు ఎన్నో సార్లు ఇలాంటి ఘటనలు జరిగినట్టు వెలుగులోకి వస్తుంది. ఒక ట్రాలీ ఆటో ను లీజుకు తీసుకుని అందులో గంజాయి స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టారు. చివరికి పోలీసులు పట్టుకోవడం తో ఏమీ తెలియని ఆటో ట్రాలీ ఓనర్ జైలుపాలయ్యాడు. ఇక ఇటీవల చత్తీస్ఘడ్లో డ్రైవర్ కు తెలియకుండానే గోనె సంచుల్లో నింపి ప్యాకెట్లను వెనుక భాగంలో అమర్చారు. ఇలా బస్సు డ్రైవర్ కు తెలియకుండానే గంజాయి మాఫియా కారణంగా బస్ డ్రైవర్ జైలు పాలయ్యాడు. ఇలా సహాయం చేయాలనే గుణమే ఎంతో మందిని జైలుపాలు చేసింది. సహాయం చేయడం మంచిదే కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.