మనిషి కాదు రాక్షసుడు.. 2 నెలల పసిగుడ్డును?
నేటి రోజుల్లో కూడా ఆడపిల్లలు చెత్తకుప్పల్లో దర్శనమిస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాచుకో వలసిన తండ్రి కిరాతకుడిగా మారిపోయాడు. నెలలు నిండని పసిగుడ్డు ఉసురు పోసుకున్నాడు. ఆడపిల్లగా పుట్టింది అన్న కారణంతో ఏకంగా పేగు బంధాన్ని కూడా లెక్కచేయకుండా దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో వెలుగులోకి వచ్చింది. కాగజ్ నగర్ మండల పరిధిలోని లైన్ గూడ గ్రామానికి చెందిన బాబురావు అనే వ్యక్తికి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది.
వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఇద్దరు పిల్లలు చాలు అనుకోకుండా ఇక మూడవ సంతానం.. మగ పిల్లవాడి కోసం బాపురావు ఆశించాడు. అయితే ఇటీవలే మూడవ సారి కూడా ఆడపిల్ల జన్మించింది. దీంతో తల్లిదే తప్పు అన్నట్లుగా తల్లి తో గొడవ పడడం మొదలుపెట్టాడు బాబురావు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన బాబురావు ఇంటికి వెళ్లి పుట్టిన బిడ్డని చంపుతాను అంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్లి తల్లి పొత్తిళ్లలో సేదతీరుతున్న 38 రోజుల ఆడశిశువును బలవంతంగా ఎత్తుకొని రోడ్డుపై పడేసాడు. అంతటితో ఆగకుండా బండరాయితో పసిగుడ్డు తలపై గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయిన ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.