
దారుణ: నడిరోడ్డుపై సినీ ఫక్కీలో మర్డర్.. అసలు ఏం జరిగిందంటే..!?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం గుంటూరులోని గుడనగుండ్ల పార్క్ సెంటర్లో అందరూ చూస్తుండగానే అంగళకుర్తి మంగరాజు అనే రౌండీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. మంగరాజు నడుచుకుంటూ వెళ్తుండగా ఆటోలో వచ్చిన కొందరు యువకులు అతడ్ని వెంబడించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుంటూరులోని తుపాన్ నగర్ లో ఉండే మంగరాజుతో పాటు అతడి కుమారుడు పుల్లయ్యపైనా రౌడీ షీట్ ఉంది. ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేసిన కేసులో మంగరాజు ఏ1గా, పుల్లయ్య ఏ2గా ఉన్నారు.
ఇక ఇదే కేసులో అరెస్టైన తండ్రీ కొడుకులు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు. ఇదే క్రమంలో పార్క్ సెంటర్లో ఉండే ఓ ఆటో డ్రైవర్ తో పాటు తుపాన్ నగర్ లో ఉండే మరో ఇద్దరితో మంగరాజు రెండు రోజుల క్రితం ఘర్షపడ్డాడు. ఈ హత్యకు ఇదే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మంగరాజుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఈ విషయంపై తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అయితే హత్యకు వివాహేతర సంబంధం కూడా కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మంగరాజుతో గొడవపడ్డవారితో పాటు వివాహేతర సంబంధమున్న మహిళను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే హత్య జరిగిన గుజ్జనగుండ్ల పార్క్ సమీపంలో సీసీ ఫుటేజీలను కూడా పోలీసులు సేకరించారు. ఐతే నడిరోడ్డుపై సినీ ఫక్కిలో దారుణహత్య జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రత్యక్ష సాక్షులు భయంతో వణికిపోయారు.