అమ్మో.. అమ్మో.. ఎంత మోసం ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకునే ఊడ్చేస్తున్నారుగా?
రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వర్తి వాసులు ఒర్సు శివ అలియాస్ శ్రీను (46) ఇతని భార్య భాగ్యమ్మ. ఈ దంపతులు గత కొన్నేళ్లుగా శేరిలింగంపల్లి మండలం గౌలిదొడ్డిలో నివసిస్తున్నారు. అయితే జనవరి 27న మొయినాబాద్ ఇంద్రారెడ్డి కూడలీలో పనికోసం వేచి చూస్తున్న మాణిక్యమ్మ వద్దకు వెళ్లి పని చూపిస్తామంటూ వారి బైక్ పై తీసుకెళ్లారు. మార్గం మధ్యలో మాణిక్యమ్మకు కల్లు తాగించారు. మత్తులో ఉండగా ఆమెను ఒక నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడినుంచి ఉడాయించారు. ఆరోజే మాణిక్యమ్మ ఆ దొంగ దంపతులపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉంటే ఈ దంపతులు మళ్లీ వికారాబాద్ జిల్లా దోమ మండంలోని ఖమ్మంనాచారం గ్రామానికి చెందిన రాపోలు సుక్కమ్మ(44)ను కూడా ఇలాగే మోసం చేశారు. ఈమె కూడా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఈ దొంగ దంపతులపై నిఘా పెట్టారు. కాగా బుధవారం నాడు ఈ దొంగ దంపతులను పట్టుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు. కాగా వీరిపై 2015 లోనూ ఇలాంటి ఫిర్యాదు నమోదయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అయితే శ్రీను గత నెల ఓ మహిళకు పని చూపిస్తానంటూ అతని వెంట తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు వెళ్లడించారు.