ఇన్‌స్టంట్ లోన్ అయిపోయింది.. ఇప్పుడు ఇన్‌స్టంట్ ఇన్స్యూరెన్స్!
రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఇన్స్యూరెన్స్ పేరుతో దందా చేస్తున్న ఓ ముఠాను పట్టుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. మంగళవారం ఆ ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హయాత్‌నగర్ ఇంజాపూర్‌కు చెందిన రమేశ్, వనస్థలిపురానికి చెందిన సాయిరామ్, బీఎన్‌రెడ్డినగర్‌లో నివసిస్తున్న గోవర్ధన్, కూకట్‌పల్లి ప్రగతినగర్‌కు చెందిన రమేశ్, రాజు, ప్రవీణ్, మలక్‌పేటకు చెందిన సుధీర్‌కుమార్, జి.కృష్ణ, మేడ్చల్ నివాసి శంకర్, హఫీజ్‌పేటకు చెందిన జితేందర్, కొండాపూర్‌కు చెందిన రవి.. వీరంతా హైదరాబాద్‌తో పాటు నగర శివార్లలో అనేక చోట్ల పొల్యూషన్ చెకప్ వాహనాలను నిర్వహిస్తున్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి.. ‘ఇన్‌స్టంట్ ఇన్సూరెన్స్’ దందాకు తెరలేపారు. వీరిలో సాయిరామ్ గతంలో కొన్ని బీమా కంపెనీలకు ఏజెంట్‌గా పనిచేయడంతో అతని సహాయంతో ఆయా కంపెనీల నకిలీ పత్రాలు తయారు చేసి వాహనదారులకు డూప్లికేట్ ఇన్స్యూరెన్స్ పత్రాలను ఇచ్చేవారు.
‘50 శాతం రాయితీతో ఇన్స్యూరెన్స్ కల్పిస్తాం’ అని చెప్పడంతో వాహనదారులు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా వారి ఉచ్చులో పడిపోతున్నారు. సాధారణంగా ఒక బైక్‌కు ఏడాది బీమా ప్రీమియం రూ.1,500 చెల్లించాల్సి ఉండగా, వీరు రూ.750కే ఇన్స్యూరెన్స్ పత్రాలు చేతిలో పెడుతున్నారు. భారీ వాహనాలకు రూ.లక్ష వరకు చెల్లించాల్సి ఉండగా.. రూ.20వేలకే బీమా చేసి ఇచ్చేస్తున్నారు. వాహనాల బదిలీకి ఆర్టీయే కార్యాలయాల్లో బీమా పత్రం తప్పనిసరి. దీంతో ఆర్టీయే ఏజెంట్లు కొందరు వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. పకడ్బందీగా ఇన్సూరె న్స్ సర్టిఫికెట్లను తయారు చేయడంతో.. వీరు ఇస్తున్న సర్టిఫికెట్లు అసలైనవా? నకిలీవా? అని గుర్తించడం సామాన్యులకు సాధ్యపడడం లేదని సీపీ సజ్జనార్ వెల్లడించారు.
కర్నాటకలో జరిగిన ఓ వాహన ప్రమాదం నేపథ్యంలో ఈ నకిలీ బీమాల విషయం బయటకు వచ్చింది. ఈ ముఠాలో ఓ వ్యక్తి ఇచ్చిన బీమా నకిలీదని తేలడంతో పోలీులు పటిష్ఠ నిఘాతో వారిని అరెస్టు చేశారు. అయితే అసలైన బీమాలను గుర్తించడంలో వాహనదారులు జాగ్గరత్తలు పాటించాలని సీపీ సూచించారు. వాహన బీమాలను వీలైనంత వరకు బ్యాంకులు లేదా రెస్పెక్టివ్ ఏజెంట్ నుంచే తీసుకోవాలని బీమారంగ నిపుణులు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ నంబరును సంబంధిత బీమా కంపెనీల వెబ్‌సైట్లలో తనిఖీ చేసుకోవచ్చని, బీమా తీసుకోగానే ఒకసారి వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ బీమా కంపెనీల వెబ్‌సైట్లలో ఆ పాలసీల వివరాలు లేకుంటే.. అది నకిలీ బీమా పాలసీ అని నిర్ధారించుకోవాలి. వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.