బీట్ రూట్ తో ఇలా కూడా చేయవచ్చా...?

Suma Kallamadi
ఈ లాక్ డౌన్ సమయంలో అందరు కూడా ఇంటికే పరిమితం అయిన విషయం అందరికి తెలిసిందే. అందరు ఇంటిలోనూ ఉంటారు కాబట్టి సాయంత్రం పూట మేము చెప్పే ఈ స్పెషల్ స్నాక్ ఐటమ్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రుచికరంగా ఉంటాయి. మన అందరికి బీట్ రూట్ గురించి బాగా తెలుసు.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  రక్త హీనత ఉన్న వారు బీట్ రూట్ తింటే చాలా మంచిది.అయితే కొంతమంది మాత్రం బీట్ రూట్ తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఎర్రగా, తియ్యగా ఉండడం వలన చాలా మంది తినరు. కానీ బీట్ రూట్ తో మేము చెప్పే విధంగా పకోడీలు వేసి చూడండి.వద్దు అన్నా మీరే మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు. మరి ఆలస్యం చేయకుండా బీట్ రూట్ పకోడిలు ఎలా తయారు చేయాలో చూద్దామా. !
కావలసిన పదార్ధాలు :
బీట్‌ రూట్‌ తురుము - అర కప్పు
పచ్చి శనగపప్పు - అర కప్పు ముందుగా (నాన బెట్టుకోవాలి)
జీలకర్ర - పావు టీ స్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్
బియ్యపు పిండి - 1 టేబుల్‌ స్పూన్‌
మొక్కజొన్న పిండి(కార్న్ ఫ్లోర్ ) - 1 టేబుల్‌ స్పూన్‌, కారం - 1 టీ స్పూన్‌
ఉల్లిపాయలు - 2
కొత్తి మీర తురుము - కొద్దిగా
ఉప్పు - తగినంత నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా
సన్నగా తరముకున్న అల్లం ముక్కలు -కొద్దిగా
తయారీ విధానం :  


ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో ముందుగా తడుముకున్న బీట్‌ రూట్‌ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు, బియ్యపు పిండి, మొక్కజొన్న పిండి, కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తడుముకున్న అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమంలోనే  తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని ఒక బాండీ పెట్టి తగినంత నూనె పోయాలి.నూనె  బాగా కాగిన తర్వాత పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని పకోడాలు లాగా వేసుకోవాలి.ఎర్రగా వేగాక ఒక ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ స్నాక్స్ ఐటమ్ ని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సాయంత్రం పూట ఒకసారి ఈ బీట్ రూట్ పకోడాలను ట్రై చేసి చూడండి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: