స్వీట్ కార్న్ తో ఈ రెసిపీ ఎప్పుడైనా ట్రై చేసారా..?

Suma Kallamadi
ప్రతి రోజు ఇంట్లో ఒకేరకమైన వంటలు చేస్తున్నారా.అవి తిని ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టి ఉంటుంది కదా.అందుకనే ఒకసారి మేము చెప్పే ఈ స్వీట్ కార్న్ పాయసం రెసిపీని ట్రై చేసి చూడండి .స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. పిల్లల దగ్గర నుండి పెద్దల దాక అందరు స్వీట్ కార్న్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు.అలాగే స్వీట్ కార్న్ తినడం వలన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. తియ్యటి రుచితో పాటు తక్కువ సమయంలోను ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా. !
కావలసినవి:
స్వీట్‌ కార్న్‌ - 2 కప్పులు
చిక్కటి పాలు - 4 కప్పులు
నెయ్యి - పావు కప్పు
కుంకుమ పువ్వు -చిటికెడు
పంచదార - అర కప్పు
ఏలకుల పొడి - 1 టీ స్పూన్‌
పిస్తా, కిస్‌ మిస్, జీడిపప్పు, బాదం పప్పు - 2 టేబుల్‌ స్పూన్‌ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు - చిటికెడు
తయారీ విధానం :
ముందుగా స్టవ్ ఆన్ చేసి స్వీట్ కార్న్ ను మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన కార్న్‌లో 2 టేబుల్‌ స్పూన్లు తీసి పక్కనపెట్టుకోవాలి. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక బౌల్‌ తీసుకుని అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న కార్న్‌ మిశ్రమం వేసి అందులో 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసి, కళాయిలో 4 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్‌ - పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ అడుగంటకుండా  చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఈ పాయసం చిక్కపడిన తరువాత  బాదం, జీడిపప్పు, కిస్‌ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్‌ కార్న్‌ పాయసం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: