వెలగ పండుతో స్మూతి, ఐస్ క్రీమ్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay

ఇక ఎండాకాలం వచ్చేసింది. ఎండలు బాగా మండిపోతున్నాయి. ఎండాకాలంలో చాలా మంది చల్లటి పానీయాలు, ఐస్ క్రీమ్స్ తినాలని అనుకుంటారు. ఇక వెలగపండుతో ఇంట్లో వుండే సింపుల్ గా ఐస్ క్రీమ్ ఇంకా స్మూతి లను తయారు చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి....
వెలగ పండు ఐస్‌క్రీంకి కావలసిన పదార్ధాలు :
పంచదార- 1 టేబుల్‌ స్పూన్‌;
కొబ్బరి పాలు- అరకప్పు;
వెలగ కాయ - 1
వెలగపండు ఐస్ క్రీమ్ తయారీ విధానం :
ముందుగా ఒక పాత్రలో వెలగ పండు గుజ్జు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. కొబ్బరి పాలు జత చేస్తూ మరోసారి మెత్తగా చేయాలి. పంచదార జత చేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అంగుళం మందం ఉన్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి, డీప్‌ ఫ్రీజ్‌లో ఐదు గంటల పాటు ఉంచి బయటకు తీయాలి. స్టౌ మీద పాన్‌ వేడయ్యాక, ఫ్రిజ్‌లో ఉంచిన ప్లేటును బయటకు తీసి, అందులోని వెలగపండు మిశ్రమాన్ని పాన్‌లో వేసి, కొద్దిసేపు ఉంచి, మళ్లీ ప్లేటులో పోసి, డీప్‌ ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు ఉంచి, బయటకు తీసి, ఐస్‌ క్రీమ్‌ కప్పుల్లో అందించాలి.అంతే రెడీ అయినట్లే.
ఇప్పుడు వెలగ పండు స్మూతి తయారు చేయు విధానం గురించి తెలుసుకోండి.
కావలసిన పదార్ధాలు :
 వెలగపండు -1; తేనె- 2 టేబుల్‌ స్పూన్లు; ఓట్స్‌ - ఒక టేబుల్‌ స్పూను; పెరుగు- అర కప్పు; తాజా కొబ్బరి తురుము - ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్‌ స్పూను, దానిమ్మ గింజలు- ఒక టీ స్పూను; మామిడికాయ ముక్కలు - ఒక టీ స్పూను; జీడిపప్పు ముక్కలు - ఒక టీ స్పూను.
తయారు చేసే విధానం :
ముందుగా ఓట్సును తియ్యటి నీళ్లలో లేదా ఏదైనా పళ్లరసంలో పది నిమిషాలు నానబెట్టాలి. వెలగపండును పగులగొట్టి గుజ్జు బయటకు తీసి, రెండు కప్పుల నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాలి. మెత్తగా పిసికి, పీచును, గింజలను వేరు చేయాలి. మిక్సీలో వెలగ పండు గుజ్జు, తేనె, ఐస్‌ క్యూబ్స్, బెల్లం పొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన ఓట్స్, ఏలకుల పొడి, పెరుగు, మిరియాల పొడి వేసి మెత్తగా చేయాలి. గ్లాసులలో పోసి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, జీడిపప్పు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలతో అలంకరించి అందించాలి.ఇక అంతే వెలగ పండు స్మూతి తయారయ్యినట్లే...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: