హెరాల్డ్ స్పెషల్ కర్రీ : ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ మీకోసం.. !!
పాలకూరతో చేసే అతి రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ కూర పాలక్ పన్నీర్ అని చెప్పవచ్చు. ఈ కూరను అతి తక్కువ సమయంలో చాలా తేలికగా తయారు చేయవచ్చు సమయానికి ఇంట్లో ఉంటే సరిగ్గా అరగంటలో చేసేయవచ్చు.ఈ కూరను రుచిగా తయారు చేయటమే కాకుండా అందంగా ప్రజెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అలా చేయాలంటే ముందుగా పాలకూరను బ్లంచ్ చేస్తే రంగు కోల్పోకుండా ఉండటమే కాకుండా గాఢమైన పసరు వాసన పోయి చక్కని వాసన వస్తుంది. అలాగే పన్నీరును కూడా కట్ చేసిన తర్వాత కాసేపు వేడి నీటిలో నానబెడితే మృదువుగా మారతాయి.అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసినవి అయితే గట్టిగా ఉండటం వల్ల కూరలో ఉప్పు, కారం, మాసాల పీల్చుకోవు.
కావలసిన పదార్థాలు:
1) 200 గ్రాముల పాలకూర
2) 200 గ్రాముల పన్నీర్
3) అరకప్పు టమోటా పేస్ట్
4) 2 మీడియం ఉల్లిపాయలు
5) 2 పచ్చి మిరపకాయలు
6) 20 గ్రాముల బటర్ లేదా నూనె
7) 1 1/2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
8) 1 tsp సోంపు
9) 2 యాలక్కాయలు
10) లవంగాలు
11) దాల్చిన చెక్క
12) ఉప్ప తగినంత
13) కారం తగినంత
14) పసుపు
15) గరం మసాలా 1 tsp
16)10 జీడిపప్పులు
తయారుచేయు విధానం:
ముందుగా పన్నీరును క్యూబ్స్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మరిగిన నీటిలో తగినంత ఉప్పు కలిపి పన్నీర్ ముక్కలను అందులో వేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు నాన
బెట్టుకోవాలి.తర్వాత ఆ నీటిని వంపేయాలి. అలాగే పాలకూరను శుభ్రంగా కడిగి ఆ తర్వాత పాలకూరను మరిగిన నీటిలో ఉప్పు వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచి వెంటనే చల్లని నీటిలో పాలకూరను వేసేయాలి.. రెండు నిముషాలు అయ్యాక ఆ చల్లని నీటిని కూడా వంపేయాలి. తరువాత పాలకూరను మిక్సీ జార్ లోకి తీసుకుని రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి.తర్వాత రెండు టమోటాలను కూడా మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి ముందుగా సోంపు మరియు యాలుక్కాయలను కాస్త దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత బట్టర్ వేసి జీడిపప్పు దోరగా వేయించి ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి.అదే బాండీలో నూనెపోసి జీలకర్ర, దాల్చిన చెక్క లవంగాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.అవి వేగాక బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడేవరకు వేగనివ్వాలి. వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటో పేస్ట్ వేసి కలిపి నూనె అంచులకు చేరే వరకు ఉడికించాలి. తర్వాత పాలకూర దాంట్లోనే పసుపు, కారం, గరం మసాలా పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో ఒక పావు కప్పు నీళ్లు పోసి, పన్నీర్ ముక్కలు వేసి రెండు నుండి మూడు నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.కూర బాగా చిక్కగా వచ్చాక స్టవ్ కట్టేయాలి. పైన నూనె కనపడేదాకా ఉంచాలి. తర్వాత ఎర్రగా దోరగా వేయించిన జీడిపప్పు వేసి తింటే కూర మంచి రుచిగా ఉంటుంది.. ఈ పాలక్ పన్నీర్ కూర వేడి వేడిగా చపాతీలో తింటే భలే ఉంటుంది.. చాలా మంచి పోషక విలువలు ఉన్న కూర పాలక్ పన్నీర్ కూర. తప్పకుండా ట్రై చేసి రుచిని ఆస్వాదించండి.. !!