ఎంతో రుచికరమైన పెసరపప్పు పులుసు ఎలా తయారుచేయాలో తెలుసుకోండి. !

Suma Kallamadi
చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరు అయిన  ఇష్టంగా తినే సింపుల్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే అది పెసరపప్పు పులుసు అనే చెప్పాలి. పెసరపప్పుతో పెట్టిన ఈ రెసిపీ కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ ఎప్పుడు చేసినా సూపర్ హిట్.  అన్నీ పులుసులు మాదిరిగా ఇందులో చింతపండు పులుసు ఉండదు నిమ్మరసం ఉంటుంది. వేసవిలో ఇంకా నోరుబాగలేనప్పుడు, తేలికగా ఏదైనా తినాలనుకున్నప్పుడు వేడిగా అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది .మరి ఆలస్యం చేయకుండా పెసరపప్పు పులుసు ఎలా పెడతారో తెలుసుకుందామా.. !
కావలిసిన పదార్ధాలు :
1/2 cup పెసరపప్పు
1/2 cup సాంబార్ ఉల్లిపాయలు/ఉల్లిపాయ చీలికలు
6 పచ్చిమిర్చి
ఉప్పు
1/2 tsp పసుపు
1/2 liter నీళ్ళు
2.5 tbsp నిమ్మరసం
తాలింపు కోసం
2 tsp నూనె/నెయ్యి
2 ఎండు మిర్చి
1 tsp ఆవాలు
1 tsp జీలకర్ర
1 రెబ్బ కరివేపాకు
ఇంగువా – చిటికెడు
కొత్తిమీర – చిన్న కట్ట
తయారీ విధానం :
ముందుగా పెసరపప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపి కడిగి 2.5 కప్పుల నీళ్ళతో మెత్తగా ఉడికించుకోవాలి.తరువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి , పసుపు, ఉప్పు, నీళ్ళు పోసి ఉల్లిపాయలు మెత్తగా ఉడికేదాక మూతపెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా ఉడికాక మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పుని ఉల్లిపాయాల్లో పోసి కలుపుకోండి. పులుసుని 3-4 నిమిషాలు మరగనివ్వాలి. చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు మరిగిన పులుసులో నిమ్మరసం కలిపి స్టవ్ ఆపేయాలి. తరువాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, సాయి మినపపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఒక్కోటిగా వేసి సన్నని మంట మీద వేపుకోవాలి. తాలింపు వేగాక దాన్ని  పులుసులో కలపాలి. ఆఖరున కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవడమే.ఎంతో రుచికరమైన పెసరపప్పు పులుసు రెడీ అయినట్లే.. !!వేడి వేడి అన్నం,ఇడ్లీ అట్టుతో  ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: