రిలయన్స్ లోకి వారసులోస్తున్నారు.. ఎవరంటే..!

MOHAN BABU
తరం మారుతోంది, కొత్తతరం వస్తోంది. దేశ దిగ్గజ వ్యాపార సామ్రాజ్యానికి వారసులోస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ త్వరలో కొత్త తరం చేతుల్లోకి వెళ్ళిబోతుందని స్వయంగా ముఖేష్ అంబానీ ప్రకటించారు. మరి కొత్త తరానికి పూలబాటేనా,ముళ్లబాటనా..? భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ముఖేశ్ అంబానీ దాని అధినేత. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో నాయకత్వ మార్పు ఉంటుందని కంపెనీ చైర్మన్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ తొలిసారిగా వెల్లడించడం ఓ కీలక పరిణామంగా వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి.

గ్రూపు వ్యవస్థాపకులైన ధీరుబాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా ప్రసంగించిన ముఖేష్ తనతో పాటు సీనియర్లందరూ ఈ మార్పులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామన్నారు. వారసత్వ ప్రణాళికలపై ఇప్పటివరకు నోరు విప్పని ముఖేష్ అంబానీ మొదటిసారిగా ఇకపై నాయకత్వమార్పు ప్రక్రియలు  వేగవంతం చేస్తామన్నారు.ఆయనకు ఆకాష్,అనంత్ అనే ఇద్దరు కుమారులున్నారు.ఈషా అనే ఓ కుమార్తె ఉంది.అందులో ఆకాష్, ఈషా కవలలు. ముకేశ్ అంబానీ వారసత్వ ప్రకటన నేపథ్యంలో అందరికీ గతం గుర్తొస్తుంది. నాడు ధీరుబాయ్ అంబానీ మరణానంతరం ముఖేష్,అనిల్ అంబానీ ల ఆస్తి వివాదం తర్వాత ఒకరు ఆకాశానికి ఎగబాకడం, మరొకరు పాతాళానికి దిగజారడం వంటి భూత,వర్తమానాలు కళ్ళముందే  గిర్రున తిరుగుతున్నాయి. బాబాయ్ లా ఫెయిల్ అవుతారా, నాన్నలా సక్సెస్ బాట పడతారా? ఈ అనుభవాల నేపథ్యంలో ఆకాష్,అనంత్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే దానిపై చాలామంది చర్చించుకుంటున్నారు. తండ్రి హయాంలో రిలయన్స్ సంస్థ పది మెట్లు ఎక్కితే,కుమారుల హయాంలో వంద మెట్లు ఎక్కింది. కాలక్రమేణా అనిల్ అంబానీ తప్పటడుగులు వేశారు నిండా మునిగిపోయారు. కానీ స్లో అండ్ స్టడీ ని నమ్ముకున్న ముకేశ్ అంబానీ వ్యాపారంలో శిఖరానికి చేరారు. ముఖేష్ అంబానీ ముగ్గురు సంతానంలో ముగ్గురూ ముగ్గురే. వ్యాపారంలో తమదైన ముద్ర వేసిన యంగ్ తరంగ్ లే. తాత నాన్న అభివృద్ధి చేసిన రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే ఎలాంటి అద్భుతాలు నమోదు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: