ఒమిక్రాన్ ఎఫెక్ట్ : 5 రోజుల్లో 12వేల విమ‌నాలు ర‌ద్దు..!

Paloji Vinay
క‌రోనా సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు.. ప్ర‌జ‌ల ఆరోగ్యంతో పాటు.. అన్ని రంగాలు అత‌లాకుతలం అయ్యాయి. ముఖ్యంగా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. దీంతో అంత‌ర్జాతీయ ర‌వాణా, ప్ర‌యానాల్లో కీల‌క‌మైన పౌర విమాన‌యాన రంగం కోలుకోలేని విధంగా దిగ‌జారిపోయింది. క‌రోనా మొద‌టి ఉదృతితో మొద‌ల‌యిన ఈ ప‌రిస్థితి రెండో ఉధృతి వ‌ర‌కు కొన‌సాగింది. దీంతో పాటు పౌర విమాన‌యాన రంగంపై ఆధార‌ప‌డిన అనేక ప‌రిశ్ర‌మ‌లు కూడా తీవ్ర ప్ర‌భావానికి గుర‌య్యాయి. క‌రోనా పెరుగుతుంద‌న్న సూచ‌న‌లతో మొద‌ట‌గా ప్ర‌భావానికి గుర‌య్యేది.. గుర‌య్యింది కూడా అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలేన‌ని అంద‌రికీ తెలిసిందే.

  అయితే, ఇప్పుడిప్పుడే అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు పెరిగి విమాన సేవ‌లు తిర‌గి ప్రారంభ‌వ‌తుండ‌డంతో విమాన‌యాన రంగం గాడిలో ప‌డుతోంది. ఈ క్ర‌మంలో క‌రోనా కొత్త వేరియంట్ మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ‌ట్టుగా మారింది. ఒమిక్రాన్ గండం ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి అనేక ప్ర‌పంచ దేశాలు అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డం మొద‌లు పెట్టాయి.  ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ ప్ర‌యాణాలు సుర‌క్షితం కాద‌ని భావిస్తున్న ప్ర‌జ‌లు త‌మ ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకుంటున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతో ప్ర‌యాణీకులు లేక‌పోవ‌డంతో అనేక విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌వుతున్నాయి.

  క‌రోనా కొత్త వేరియంట్ ఆందోళ‌న‌తో విమాన‌యాన రంగం మ‌రోసారి క‌ష్టాల్లోకి వెళ్తోంది. గ‌డిచిన ఐదు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 12 వేల విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌యిన‌ట్టు ఓ ప్రైవేట్ సంస్థ ప్ర‌క‌టించడం న‌ష్టం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. సోమ‌వారం ఒక్క‌రోజే మూడువేల‌కు పైగా విమాన ప్ర‌యాణాలు ర‌ద్ద‌య్యాయి. మ‌రోవైపు డేంజ‌ర్ వైర‌స్ ఒమిక్రాన్ భ‌యంతో ఏయిర్‌పోర్ట్  సిబ్బంది, స్టాఫ్ కూడా విధుల‌కు హాజ‌రుకావ‌డం లేద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. ఇయ‌ర్ ఎండింగ్ కావ‌డంతో ప్ర‌తి ఏటా డిసెంబ‌ర్ మాసం చివ‌రి వారంలో ప్ర‌యాణీకుల‌తో ఏయిర్‌పోర్టులు ర‌ద్దీగా మారేవి.. కానీ ఈ సారి ఒమిక్రాన్ ఎఫెక్ట్ ప్ర‌భావంతో డ‌ల్‌గా మారిపోయాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి ప‌రిస్థితులు ఏర్పడుతాయోన‌ని ఆందోళ‌న చెల‌రేగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: