అమ్ముదామంటే... రికార్డులతో పరుగులు..!

Podili Ravindranath
ఓ వైపు కేంద్రం అమ్ముదామనుకుంటుంది... కానీ పరిశ్రమ మాత్రం రికార్డుల మీద రికార్డులు సాధిస్తోంది. రాష్ట్రియ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థగా పేరు మార్చుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ రికార్డులతో పరుగులు పెడుతోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో... గతంలో ఎన్నడూ లేనంతగా.... ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు నెలలో అత్యధిక స్థాయిలో ఉత్పత్తి వచ్చినట్లు ఆర్ఐఎన్ఎల్ అధికారులు వెల్లడించారు. 5 లక్షల టన్నుల హాట్ మెటల్, 4.47 లక్షల టన్నుల క్రూడ్ ఉక్కు, 4.43 లక్షల టన్నుల సేలబుల్ స్టీల్‌ను విశాఖ స్టీల్ ఇండస్ట్రీ ఉత్పత్తి చేసింది. ఒక్క ఆగష్టు నెలలో మొత్తం 13.90 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్లు ఆర్ఐఎన్ఎల్ వెల్లడించింది.
విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టాల వంక చూపుతున్న కేంద్ర ప్రభుత్వం... దానిని వంద శాతం ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై దాదాపు 6 నెలలుగా విశాఖ నగరంలో అటు కార్మికులు, ఇటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నిరసనలు చేస్తున్నాయి. ఇదే విషయంపై పార్లమెంట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేతలు... కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలు, ఎంపీలను స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ఇంత జరుగుతున్నా కూడా కేంద్రం మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పూర్తిస్థాయిలో ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు. దీంతో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఓ వైపు ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ... రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తోంది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇప్పటికైనా కేంద్రం కరుణిస్తిదేమో చూడాలి మరి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: