కేజీ టమోటా 25పైసలే..!

NAGARJUNA NAKKA

పంట దిగుబడి వచ్చినా... పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి టమోటా రైతులది. పత్తికొండ మార్కెట్ లో  కేజీ టమోటా 25 పైసలు పలికింది.  గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రవాణా ఛార్జీలకు సరిపడా డబ్బులు కూడా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  

 

కర్నూలు జిల్లా, పత్తికొండ టమోటా మార్కెట్‌లో ధరలు లేక రైతులు లబోదిబోమంటున్నారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండల పరిధిలో టమోట సాగు చేసిన అన్ని గ్రామాల రైతులు ఇదే యార్డుకు వస్తుంటారు. ఈ ప్రాంతంలో పండించిన టన్నుల కొద్దీ టమోట బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది.  సాగు ప్రారంభ సమయంలో విత్తనాలు, నారు ధరలు బాగానే ఉన్నా... పంటకు ధర బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు అప్పులు చేసి మరీ టమోటా సాగు ప్రారంభించారు. అయితే ఆరుగాలం కష్టించిన రైతన్నకు పంట చేతికొచ్చే సమయంలో ధరలు పతనం కావడంతో కన్నీరుపెడుతున్నారు. 

 

ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమోట కేవలం  25 పైసలు మాత్రమే పలుకుతోంది. దిగుబడి బాగానే ఉన్నా, ధర లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడి సంగతి దేవుడెరుగు, కనీసం రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కొందరు రైతులు పంటను పశువులకు వేసుకుంటామని తీసుకెళుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

తెలంగాణ రాష్ట్రంలో లోకల్ టమోట రావడంతో,  ఇక్కడి టమోట ధరలు పడిపోయాయని వ్యాపారస్థులు అంటున్నారు. మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు టమాట రైతులు. కనీస ధర కూడా లేకపోతే బతికేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కర్నుూలు జిల్లా రైతులు టమోటా ధరల తగ్గుదలతో లబోదిబోమంటున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు దిగాలుగా కూర్చున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: