అనిల్ అంబానీకి ఎవరూ ఊహించని షాక్.. !

NAGARJUNA NAKKA
అన్న ఆకాశంలో ఉంటే .. తమ్ముడు పాతాళంలో కూరుకుపోతున్నాడు. ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకడిగా ముకేష్ అంబానీ ఎదిగితే, తమ్ముడు అనిల్ అంబానీ ఆఖరికి బిలియనీయర్ కూడా కాకుండా పోయాడు. అప్పులు తీర్చమని బ్యాంకులు కేసులు  మీద కేసులు వేస్తున్నాయి.


ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోతున్న అనిల్ అంబానీకి మరో భారీ షాక్ తగిలింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని చైనాకు చెందిన పలు బ్యాంకులు లండన్ కోర్టు కేసు ఫైల్ చేశాయి. అనిల్ అంబానీ కంపెనీలు తమకు 680 మిలియన్ డాలర్లు అంటే, దాదాపు రూ.5000 కోట్లు రుణాల చెల్లింపుల్లో విఫలమైనట్లు చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండిస్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాలు ఆరోపించాయి. ఈ మూడు 2012లో రిలయన్స్ కమ్యూనికేషన్‌ కు 925.2 మిలియన్ డాలర్ల అప్పులు ఇచ్చాయి. 


తీసుకున్న అప్పుల్లో ఆర్‌ కామ్‌ కొంత వరకు తిరిగి చెల్లించినా, 2017 ఫిబ్రవరి నుంచి మిగతా చెల్లింపుల్లో విఫలమైంది. అనిల్ అంబానీకి చెందిన నాలుగు ప్రధాన లిస్టెడ్ కంపెనీలు మొత్తం రూ.93,900 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. ఇందులో రిలయన్స్ నావెల్ అండ్ ఇంజనీరింగ్ రూ.7,000 కోట్లు, రిలయన్స్ కాప్ రూ.38,900 కోట్లు, రిలయన్స్ పవర్ రూ.30,200 కోట్లు, రిలయన్స్ ఇన్ ఫ్రా రూ.17,800 కోట్ల చొప్పున బాకీ పడి ఉన్నాయి. అదనంగా దివాలా తీసిన ఆర్కామ్ రూ.35,600 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. 


అనిల్ అంబానీ కంపెనీలు ఒక్కోక్కటి వరుసగా ఆర్ధిక సంక్షోభంలో పడటంతో అడాగ్ గ్రూపు ఉనికికే ప్రమాదం వచ్చి పడింది. అన్న ముకేశ్  అంబానీ 56 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థాయికి ఎదిగితే, అనిల్ అంబానీ ఆస్తి మాత్రం వేగంగా తగ్గిపోయింది. అయితే బ్యాంకుల అప్పులకు తాను నాన్ బైండింగ్ పర్సనల్ కంఫర్ట్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకుంది నిజమే అయినా, పర్సనల్ గ్యారంటీ మాత్రం ఇవ్వలేదని వాదిస్తున్నారు. 


స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ కు అంబానీ బకాయిపడ్డ రూ.550 కోట్లను చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని  కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు హెచ్చరించింది. ముకేశ్ సాయం చేయడంతో ఆ సమస్య నుంచి అనిల్ బయటపడ్డారు. అనిల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టడంతో ఇది కొత్త పాలసీలు ఇవ్వకుండా ఐఆర్డీఏ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. తండ్రి ధీరూబాయ్ అంబానీ మరణం తరువాత ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు పెరిగాయి. దీంతో వ్యాపారాలను పంచుకున్నారు. ముకేశ్ ఆయిల్, పెట్రోకెమికల్స్ వ్యాపారాలు దూసుకుపోగా, అనిల్ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: