ఆ మద్య మ్యాగీ నూడుల్స్ పై ఎన్నో వివాదాలు వచ్చాయి. భారత దేశంలో నూడుల్స్ పై వ్యతిరేక ఉద్యమాలు కూడా పుట్టుకు వచ్చాయి. తాజాగా మరోసారి నూడుల్స్ తయారీ సంస్థ నెస్లె ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇన్‌స్టెంట్ నూడుల్స్‌గా ప్రజాదరణ పొందిన మ్యాగీలో సీసం, ఎంఎస్‌జీలు ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ నూడుల్స్‌ను బ్యాన్ చేసింది. దీనిపై నెస్లే సంస్థ బొంబాయి హైకోర్టులో సవాలు చేసింది.
తర్వాత కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో మ్యాగీలో ప్రమాణాలకు అనుగుణంగానే ఉత్పత్తి కొనసాగుతోందని నిర్దారణ కావడంతో బొంబాయి హైకోర్టు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బొంబాయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.