హసీనా: అలా చేసి ఉంటే అధికారంలో కొనసాగేదాన్ని..!

frame హసీనా: అలా చేసి ఉంటే అధికారంలో కొనసాగేదాన్ని..!

FARMANULLA SHAIK
రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్‌ను రణరంగంగా మార్చింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇక రైల్వేలు నిలిచిపోయాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ప్రధానమంత్రి షేక్ హసీనాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో.. ఆమె రాజధాని ఢాకాలో ఉన్న ప్రధానమంత్రి ప్యాలెస్ నుంచి హెలికాప్టర్‌లో పారిపోయారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన షేక్ హసీనా.. పక్కనే ఉన్న మన దేశంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆందోళనకారుల నుంచి తప్పించుకుని వచ్చి.. భారత్‌లో తలదాచుకున్న సమాచారం గురించి తెలిసిందే.బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. దేశం వదిలి వెళ్లిపోవడం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.బంగ్లాదేశ్‌ ఎగుమతులను అత్యధికంగా అమెరికానే కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో ఆ దేశంలో స్వేచ్ఛ, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని తరచూ డిమాండ్‌ చేస్తుంది. ఈ క్రమంలో అధికార పక్షానికి చెందిన పలువురు నాయకులు, లాఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులపై గత సెప్టెంబర్‌లో అమెరికా వీసా ఆంక్షలను విధించింది. వాషింగ్టన్‌లోని విల్సన్‌ సెంటర్‌ సౌత్‌ ఏషియా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ మిషెల్‌ కుగుల్మెన్‌ ఈ ఏడాది జనవరిలో బ్లూమ్‌ బెర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''పారదర్శక ఎన్నికల కోసం బంగ్లాదేశ్‌పై అమెరికా చాలా ఒత్తిడి చేసింది. నయానో, భయానో చెప్పి చూసింది. ఎలాంటి ప్రయోజనం లేదు.

ఫలితంగా ఇప్పుడు ఎన్నికల తర్వాత కఠిన చర్యలతో స్పందించే అవకాశం ఉంది. ఇవి బంగ్లాదేశ్‌ను బాగా ఇబ్బందిపెడతాయి'' అని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం బంగ్లా మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అజిజ్‌ అహ్మద్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. దేశంలో ప్రజాస్వామ్యం అణచివేతలో అతడి పాత్ర ఉందని ఆరోపించింది. మరోవైపు గతేడాది తమ ఎన్నికల్లో జోక్యం చేసుకొంటున్నారంటూ అమెరికా దౌత్యవేత్త పీటర్‌హాస్‌ను బంగ్లా అధికార పక్షం అవామీ లీగ్‌ నేతలు ఆరోపించారు. అప్పట్లో రష్యా కూడా అమెరికా తీరును తప్పుపట్టింది. బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటోందని ఆరోపించింది. కానీ, వీటిని ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తోందని నాడు అమెరికా తోసిపుచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అనూహ్యంగా ఓ న్యాయస్థానం కారణంగా రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. ఇది చినికి చినికి గాలివానగా మారింది. దీంతో బంగ్లా ప్రధాని అనూహ్యంగా దేశం వదిలి వెళ్లిపోవడంతో పాత అంశాలు మొత్తం తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో ఇండియాలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తుంది. తాను అధికారం కోల్పోవడానికి బంగ్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడానికి అమెరికా అనే కారణమని ఆరోపించారు.నేను సెయింట్ మార్టిన్ బంగాళ ఖాతాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే అధికారంలో కొనసాగే దాన్ని అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అవామీ లీగ్ పార్టీ నేతలకు హసీనా సందేశం పంపినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: