తెలంగాణలో ఎంతో మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పేదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.కొత్త రేషన్ కార్డుల మంజూరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది.ఈ భేటీలో ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహా పాల్గొన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హుల వార్షిక ఆదాయం రూ. లక్షన్నరగానూ, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలుగా ఉండాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలు ఉండాలని సూచించారు. పాత కార్డుల స్థానంలో కొత్తకార్డులు ఇవ్వాలని, అది కూడా స్వైపింగ్ మోడల్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తెల్లరేషన్ కార్డుల మంజూరుపై త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయాలని, ఈ ప్రక్రియలో రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అలాగే సక్సెనా కమిటీ సిఫారసులను పరిశీలించాలని, ఒక కుటుంబానికి ఒకే తెల్లరేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల గరిష్ట వార్షికాదాయం ఉన్న వారినే అర్హులుగా నిర్ణయించాలని సూచించారు. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖలు రాసి సూచనలు తీసుకోవాలని నిర్ణయించింది.రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సక్సేనా కమిటీ సిఫారసులను రేషన్ కార్డుల మంజూరుకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులుండగా.. పెండింగులో 10 లక్షల దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.