తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ కొనసాగుతున్న విషయం విధితమే. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలను గొప్పగా తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మగద సామ్రాజ్యం ఎంత విశిష్టమైనదో తెలంగాణ శాతావాహనుల చరిత్ర కూడా అంతే గొప్పదని తెలిపారు. గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం ను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన ఆలంపూర్‌ను పట్టించుకోలేదని.. ఎయిర్ స్రిప్ట్ కావాలని ఆరేండ్లుగా కోరుతున్న కేంద్రం పట్టించుకోలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన జలపాతాలున్నాయని వివరించారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ వంటి పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి జాబితా పంపాలా వద్దా అని.. ప్రధాని, హోంమంత్రులను నిలదీశానని వివరించారు. తెలంగాణలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయని వాటన్నింటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చాలా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. మొత్తానికి కేంద్రం తెలంగాణ అభివృద్ధికి ఏమి సహాయ పడడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డారు.
మరో వైపు సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం విధితమే. దీనికి తోడు ప్రతిపక్షాల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒకటేనని పేర్కొనడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలతో కలిసి స్నేహంగా వ్యహరించి... రాష్ట్రంలో మాత్రం బీజేపీని విమర్షిస్తాడని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడి సంచలన వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కేంద్రం రాష్టానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ మంత్రులు పేర్కొన్నారు. ఇప్పుడు కేసీఆర్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేయడం పై బీజేపీ నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.