అద్దెకు రైలు బోగీలు?
ఇప్పటివరకు ఎవరికైనా కావాలంటే రైళ్లను అద్దెకు ఇచ్చేది రైల్వేశాఖ. ఇకనుంచి కొత్త ప్రయోగం చేయబోతోంది. బోగీలను కూడా అద్దెకు ఇవ్వబోతోంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వీటిని లీజుకు తీసుకోవచ్చు. లేదంటే శాశ్వత ప్రాతిపదికన కూడా తీసుకోవచ్చు. వాటిని తీసుకొని వారి అభిరుచులకు, వారి ఆసక్తులకు అనుగుణంగా తయారుచేయించుకోవచ్చు. అలా తయారైనవాటిని వారు మతపరమైన కార్యక్రమాలకు, పర్యాటక కార్యక్రమాలకు, సాంస్కృతిక పరమైన కార్యక్రమాలకు నడిపించుకోవచ్చు. కనీస కాలపరిమితి ఐదు సంవత్సరాలుంటుంది. లేదంటే శాశ్వత ప్రాతిపదికన కూడా ఉంటుంది. వీటిని తిప్పే మార్గాలు, ఆయా మార్గాల్లో టారిఫ్‌ను నిర్ణయించుకునే అధికారం కూడా లీజుకు తీసుకున్నవారికే ఉంటుంది. ఒక బోగీని ఒక రెండు లేక మూడు కుటుంబాలకు సరిపోయేలా సెంట్రలైజ్డ్ ఏసీతో తీర్చిదిద్దుకుంటే తిరిగే మార్గాన్నిబట్టి ఎంత ఛార్జి వసూలు చేసుకోవచ్చనేది వారి ఇష్టానుసారమే రైల్వేశాఖ వదిలేసింది. కార్పొరేట్ కంపెనీలకు దశలవారీగా రైల్వేలను అప్పగించేందుకే ఇటువంటి విధానాన్ని తీసుకువచ్చారంటూ రైల్వే మజ్దూర్ యూనియన్ నేతలు మండిపడుతున్నారు.