మిగిలింది మూడురోజులే: లోకేష్
దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజు గుంటూరులో పట్టపగలు హత్యకు గురైన రమ్య కేసులో నిందితుణ్ని ఉరితీయడానికి ప్రభుత్వానికి తామిచ్చిన గడువులో ఇంకా మిగిలివుంది మూడురోజులేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. దిశ చట్టంకింద ఇప్పటివరకు ముగ్గురిని ఉరితీశామని, 20 మందికి కఠినశిక్ష పడిందని హోంమంత్రి సుచరిత చెపుతున్నవాన్నీ అవాస్తవాలేనని, మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దిశ చట్టం కింద ఉరి శిక్ష పడ్డవారి పేర్లను బయటపెట్టే దమ్ము ముఖ్యమంత్రి జగన్‌కు ఉందా అంటూ సవాల్ విసిరారు. సొంత మీడియాకు దిశ చట్టం పేరుతో రూ.30 కోట్ల ప్రకటనలు ఇచ్చారని, ఆ చట్టంపై ప్రచారం రాలేదని, ఆ నిధులను పోలీస్ వ్యవస్థ బలోపేతానికి ఉపయోగించివుంటే రమ్య లాంటి సంఘటనలు జరగవన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గడితప్పాయనే విషయం ఈ సంఘటనవల్ల రుజువవుతోందని, ప్రభుత్వం మాత్రం ప్రకటనలిస్తూ చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. ఇప్పటికైనా ఆడబిడ్డల రక్షణ కోసం ప్రభుత్వం సమర్థవంతమైన పోలీస్ వ్యవస్తను ఏర్పాటు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.