కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడంపై సొంత పార్టీ నేతలతో పాటు పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఎంపీ విజయ్ సాయిరెడ్డి సైతం చంద్రబాబు రేవంత్ రెడ్డికి పీసీసీ ఇప్పించారంటూ వరుస ట్వీట్ లు చేస్తు విమర్శించారు. విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో.... పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడని పేర్కొన్నారు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడంటూ ఆరోపించారు.
రాహుల్ గాంధీని ‘ఇంప్రెస్’ చేయడానికి ఏం ‘మంత్రం’ వేశాడో గాని టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడని అన్నారు. అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ(TBCC) అనాలేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడంటూ వ్యాఖ్యానించారు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలాడంటూ విజయ సాయి ఆరోపించారు.