మహిళను కత్తితో పొడిచిన ఓనర్‌.. ఎందుకంటే..!

N.ANJI
ఇంటి అద్దె ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోయిన ఒక ఓనర్ కిరాయికి ఉంటున్న మహిళపై కత్తితో దాడి చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. రాజగోపాల్‌ నగర్‌కు చెందిన మహాలక్ష్మీ అనే మహిళ తన ఇంటిని పూర్ణిమ, రవిచంద్ర అనే దంపతులకు ఏడాది క్రితం అద్దెకు ఇచ్చింది. వారు అడ్వాన్స్‌గా రూ.65 వేలు చెల్లించారు. ప్రతి నెలా రూ.6 వేలు రెంట్ ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్న రవిచంద్ర ఉద్యోగం పోయింది. దానితో ఆ కుటుంబం గత నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేకపోయింది.
 
ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్ మహాలక్ష్మి శుక్రవారం రాత్రి వారిని నిలదీసింది. బాకీ ఉన్న నాలుగు నెలల అద్దె రూ.24 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది. తనకు ఇప్పుడే మరో ఉద్యోగం వచ్చిందని ఒక నెల ఆగండి చెల్లిస్తానని రవిచంద్ర కోరాడు. మహాలక్ష్మీ  దాన్ని వినిపించుకుకోకపోవడం వల్ల తమ అడ్వాన్స్‌ నుంచి అద్దెను మినహాయించుకోవాలని ఆయన భార్య పూర్ణిమ చెప్పింది. అంతకు మించి తాము ఏమీ చేయలేమని చెప్పడం వల్ల ఆగ్రహించిన ఓనర్‌ వెంటనే కిచన్‌లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చి పూర్ణిమ చేయి, మెడపై పొడిచింది. ఇంతలో రవిచంద్ర ఆమెను అడ్డుకోవడం వల్ల అక్కడి నుంచి వెళ్లిపోయింది. దానితో బాధితుల జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకుని ఓనర్‌ మహాలక్ష్మిని అరెస్ట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: