కరోనాతో తొలి మహిళా ఎన్నికల కమిషనర్ మృతి!
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,68,876కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,915కి పెరిగింది. 3,31,146 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందు తోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,12,815 మంది కోలుకున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ కరోనా ఇటీవల కాలంలో సినీ, రాజకీయ నేతలకు మాత్రమే కాదు పోలీస్, డాక్టర్లు, ముఖ్య అధికారులకు కూడా కరోనా సోకుతుంది. తాజాగా మహారాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్ నీలా సత్యనారాయణ (72) తుదిశ్వాస విడిచారు. ఆమె కొన్నిరోజులుగా కరోనా బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ముంబైలోని సెవన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం మరణించారని హాస్పిటల్ అధికారులు ప్రకటించారు. 1972 బ్యాచ్ కు చెందిన నీలా సత్యనారాయణ.. 2009లో పదవీ విరమణ చేసిన అనంతరం మహారాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్ గా నియమితులయ్యారు.
ఎన్నికల కమిషనర్ పదవి నుంచి ఆమె 2014 లో తప్పుకున్నారు. నీలా సత్యనారాయణ మంచి రచయిత. మరాఠీలో 17 నవలలు, 10 కవితల సేకరణలు ముద్రించారు. తన జీవితచరిత్రను కూడా పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఇక ఆమె కుటుంబంలోని మరో ముగ్గురు కూడా కరోనా పాజిటివ్ కు చికిత్స పొందుతున్నారు.