బ్రేకింగ్ : చనిపోయాడనుకున్న జవాన్ నుంచి భార్యకు ఫోన్... గ్రామంలో సంబరాలు...?
సోమవారం రాత్రి చైనా భారత్ దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో సునీల్ అనే జవాన్ అమరుడైనట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కానీ ఊహించని విధంగా నిన్న మధ్యాహ్న సమయంలో జవాన్ అతడి భార్యకు ఫోన్ చేసి తాను ఇంకా బతికే ఉన్నానని చెప్పడంతో గ్రామస్థులు సంబరాల్లో మునిగిపోయారు. బీహార్‌లోని సరణ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బీహార్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు జవాన్ల పేర్లు.... వాళ్ల తండ్రుల పేర్లు ఒకటే కావడంతో ఈ పొరపాటు జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన హవల్దార్ సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన తండ్రి పేరు సుఖ్ దేవ్. సరణ్ జిల్లాకు చెందిన జవాన్ సునీల్ రాయ్ కూడా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి పేరు సుఖ్‌దేవ్ రాయ్. ఇద్దరు పేర్లు ఒకటే కావడంతో సునీల్ రాయ్ కుటుంబానికి ఇండియన్ ఆర్మీ నుంచి సమాచారం వెళ్లింది. మీడియా ద్వారా విషయం తెలిసి సునీల్ రాయ్ తన కుటుంబానికి తాను క్షేమంగా ఉన్నానని సమాచారం ఇచ్చాడు.