యాచకుని దగ్గర రెండు లక్షల రూపాయలు... ఆశ్చర్యపోయిన పోలీసులు...?
కర్నూలు జిల్లా డోన్ లో యాచకుని దగ్గర రెండు లక్షల రూపాయలు ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు అతని చిరునామా కనుక్కొని సొంతూరుకు చేర్చటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే శ్రీను అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా డోన్ పట్టణంలోని కొండపేట బీసీ హాస్టల్ పక్కన ఉన్న మసీదు దగ్గర భిక్షాటన చేసేవాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను బాల్యంలోనే డోన్ కు వచ్చి భిక్షాటన చేస్తూ ఉండగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.
స్థానికులు శ్రీనుకు సపర్యలు చేసేందుకు ద్రోణాచలం సేవా సమితి సభ్యులను సంప్రదించారు. వారు సోమవారం సపర్యలు చేసే సమయంలో అతని దగ్గర రూ.2,04,459 నగదును గుర్తించారు. పోలీసులకు సమాచారం అందగా భిక్షాటన ద్వారా శ్రీను అంత డబ్బు సంపాదించినట్టు తేలింది. 14 చొక్కాల్లోని ప్లాస్టిక్ కవర్లలో మడత వేసి ఉంచిన రూ.2.04 లక్షల విలువైన నోట్లను పోలీసులు గుర్తించారు. శ్రీను చిరునామా తెలుసుకునేందుకు డోన్ పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా పోలీసులకు శ్రీనుకు సంబంధించిన వివరాలను పంపారు.