రొమాంటిక్ పాటల రారాజు ఉదిత్ నారాయణ్‌

Vimalatha
ఉదిత్ నారాయణ్‌ను 90వ దశకంలో రొమాంటిక్ పాటల రారాజుగా పిలిచేవారు. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'రాజా హిందుస్తానీ', 'హమ్ దిల్ దే చుకే సనమ్' 'లగాన్', 'స్వదేశ్' వంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఉదిత్ నారాయణ్ పాటలు పాడారు. 90వ దశకంలో ఉదిత్ నారాయణ్ మధురమైన గాత్రం ప్రతి ఒక్కరినీ పిచ్చెక్కించేది. అతను అప్పట్లో రొమాంటిక్ పాటల రారాజుగా క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఉదిత్ నారాయణ్ 1 డిసెంబర్ 1955న బీహార్‌లోని సుపాల్‌లో జన్మించారు. అతను మైథిలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈరోజు ఉదిత్ నారాయణ్ తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒక సింగింగ్ రియాలిటీ షోలో ఆయన మాట్లాడుతూ నేను సినిమాల్లో గాయకుడిగా ఉదిత్ నారాయణ్ అని పేరు పెట్టుకున్నాను, కానీ నా పూర్తి పేరు ఉదిత్ నారాయణ్ ఝా. ఆయనను  2009లో పద్మశ్రీ, 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించారు. 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.
ఉదిత్ నారాయణ్ కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో చాలా కష్టపడ్డారు. తన ఖర్చుల కోసం హోటల్‌లో పాటలు పాడేవాడు. సింగర్ 1970లో నేపాల్ రేడియోలో జానపద గాయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. నేపాల్ సినిమా 'సిందూర్'తో కెరీర్ ప్రారంభించాడు. అయితే ఇవేమీ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వలేదు. ఉదిత్ నారాయణ్‌కి 10 ఏళ్లు పెద్దగా బ్రేక్ రాలేదు. ఖర్చుల కోసం చిన్న చిన్న ఫంక్షన్‌లు, హోటళ్లలో పాటలు పాడేవాడు. ఆ సమయంలో సంగీత దర్శకుడు చిత్రగుప్తను కలిశాడు. అతను భోజ్‌పురి పాటను అందించాడు. అతని ఇద్దరు కుమారులు మిలింద్ చిత్రగుప్త్, ఆనంద్ చిత్రగుప్త్‌లను పరిచయం చేశాడు. ఆనంద్ మరియు మిలింద్‌లు ఉదిత్ నారాయణ్ వాయిస్‌ని విన్నారు. అది వారికి చాలా నచ్చింది. వారు ఉదిత్ నారాయణ్‌కి 'పాపా కెహతే హై' పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాట సూపర్ హిట్ కావడంతో ఉదిత్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ పాట 1988లో విడుదలైన 'ఖయామత్ సే ఖయామత్' చిత్రంలోనిది. ఈ పాటతో ఉదిత్ నారాయణ్ కెరీర్ ఊపందుకుంది. దీని తరువాత ఉదిత్ నారాయణ్ షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్ సహా చాలా మంది తారల చిత్రాలలో తన మధురమైన గాత్రం మాయాజాలాన్ని చూపించారు. సింగర్ హిందీలోనే కాకుండా తమిళం, బెంగాలీ, భోజ్‌పురి, మలయాళం వంటి అనేక భాషల్లో పాటలు పాడారు.
ఉదిత్ నారాయణ్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ముఖ్యాంశాలలో ఉన్నారు. ఈ సింగర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి పెళ్ళి రంజనా నారాయణ్ ఝాతో, తరువాత దీపా నారాయణ్‌ను వివాహం చేసుకున్నారు. మొదట్లో అతను తన మొదటి భార్యను అంగీకరించడానికి నిరాకరించాడు. కాని తరువాత భార్య కోర్టును ఆశ్రయించి, వారి వివాహ చిత్రాలను చూపించినప్పుడు, ఆమె తన మొదటి భార్య అని,  ఆమె పూర్తి ఖర్చులను తానే భరిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. ఉదిత్ , దీపల కుమారుడు ఆదిత్య నారాయణ్ కూడా పాపులర్ నేపథ్య గాయకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: