విభిన్నతకు మారు పేరు ఉపేంద్ర
ఉడిపిలోని ఓ పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఉపేంద్ర పూర్తి పేరు ఉపేంద్ర రావు. ఆయన బెంగుళూరులో ఉన్న ఏపీఎస్ కాలేజ్ అఫ్ కామర్స్ లో బి.కామ్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే ఉపేంద్రకు నాటకాలన్నా, కథలు రాయడం అన్నా బాగా ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితోనే తనకు దూరపు బంధువైన ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు కాశీనాథ్ దగ్గర బి.కామ్ పూర్తి చేయగానే అసిస్టెంట్ గా చేరాడు. అలా పని చేస్తూ కథలు రాస్తూ ఉండేవారు. కాశీనాథ్ తెరకెక్కించిన "అనంతన అనంతన" అనే సినిమాకు అసిస్టెంట్ గా పని చేశాడు. అందులో కామదేవుని పాత్రలో నటించాడు. తరువాత "తర్లే నన్ మగ " అనే చిత్రాన్ని రూపొందించి దర్శకుడిగా తోలి ప్రయత్నంలోనూ సక్సెస్ అయ్యారు. ఆ తరువాత 1995లో ఆయన దర్శకత్వంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన "ఓం" మూవీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తెలుగులో రాజశేఖర్ హీరోగా "ఓంకారం" పేరుతో ఈ సినిమా విడుదలైంది. అలా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లోనూ చెరగని ముద్రను వేసుకున్నాడు ఉపేంద్ర. ఆ తరువాత హీరోగా మారి తిరుగులేని స్టార్ గా సత్తా చాటాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఉపేంద్ర బహుముఖ ప్రజ్ఞను చూపారు.