బర్త్ డే : తెలం'గాణ' మధురం మధుప్రియ

Vimalatha
జానపద సింగర్ మధుప్రియ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. "ఆడపిల్లనమ్మా" అనే సాంగ్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఈ చిన్నది. ఈరోజు మధుప్రియ పుట్టినరోజు సందర్భంగా ఆమె కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
పెద్దింటి మల్లేష్, సుజాత దంపతులకు మధుప్రియ 1997 ఆగస్ట్ 26న  జన్మించింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆమె స్వస్థలం. ఇంటర్ చదివిన మధుప్రియ ఓకే ఒక సాంగ్ తో చిన్నతనంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. మా మ్యూజిక్ లో ప్రసారమైన "రేలా రే రేలా" మ్యూజిక్ షోలో తొమ్మిదేళ్ల వయసులోనే దుమ్ము రేపింది. 2008లో ఈ సాంగ్ రాగా... అప్పట్లో మధుప్రియ పేరు మార్మోగిపోయింది. చిన్నతనంలోనే ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె సొంతంగా రాసుకున్న "ఆడ పిల్లనమ్మా" పాట ప్రతి ఇంట్లోనూ వినిపించేది. మధుప్రియ తమ ఇంట్లో పిల్లల భావించేవారు. ప్రస్తుతం 24 ఏళ్ళు ఉన్న మధుప్రియకు ఒక అక్క, చెల్లి ఉన్నారు. తెలంగాణ సాంగ్స్ పాట తెలంగాణ పిల్లగా ఎదిగిన మధుప్రియకు సినిమాలోని పాడే అవకాశం వచ్చింది. "దగ్గరగా దూరంగా" సినిమాలోని "పెద్దపులి" సాంగ్ తో సినిమా అరంగ్రేటం చేసింది. 2017లో వచ్చిన శేఖర్ కమ్ముల మూవీ "ఫిదా"లోని "వచ్చిండే" అనే పాటతో తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. అంతేకాకుండా ఈ సాంగ్ ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా సైమా, ఫిలిం ఫేర్ అవార్డులను కూడా తెచ్చి పెట్టింది. ఆ తర్వాత టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష్యం, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో పాటలు పాడింది. "హి ఈజ్ సో క్యూట్" సాంగ్ ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
2017లోనే "ఫిదా" సినిమా ఇచ్చిన మంచి గుర్తింపుతో బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. అందులో 14 రోజుల పాటు కొనసాగిన మధుప్రియ ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. అయితే ఉన్నన్ని రోజులు బుల్లితెరపై అలరించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
వ్యక్తిగత జీవితం బాధాకరమైనది. 2013లో ఈ అమ్మాయి శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరి వైవాహిక బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరిపై ఒకరు చేసిన తీవ్ర వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయారు. ఇక మధుప్రియకు దాదాపుగా రెండు కోట్ల ఆస్తి ఉంది. ఖరీదైన కారు కూడా ఉంది. ప్రస్తుతం మధుప్రియ తెలంగాణ పాటలతో పాటు సినిమా పాటలు కూడా పాడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మధుకు ఇండియా హెరాల్డ్ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: