బర్త్ డే : పేరులోనే "విజయ"మ్... అందుకే "కెప్టెన్" అయ్యాడు !

Vimalatha
ఆయన ఎందులో కాలు పెట్టినా విజయమే. పేరుకు తగ్గట్లుగానే అటు సినిమాల్లో, ఇటు రాయకీయాల్లో తనదైన ముద్ర వేశారు తమిళ నటుడు, రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్. 80వ దశకంలో విజయకాంత్ తన యాక్షన్ స్టార్ ఇమేజ్ తో సౌత్ లోనే పాపులర్ అయ్యాడు. దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 2005 తరువాత అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ రోజు కెప్టెన్ పుట్టినరోజు సందర్భంగా కెప్టెన్ కు సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.
విజయకాంత్ అసలు పేరు నారాయణన్ “విజయరాజ్” అళగస్వామి. సినిమాల్లోకి వచ్చాక విజయకాంత్ గా పేరు మార్చుకుని స్టార్ హీరోగా ఫేమస్ అయ్యాడు. విజయకాంత్ సక్సెస్ ఫుల్ స్టార్ హీరో మాత్రమే కాదు నిర్మాత, దర్శకుడు. విజయకాంత్ ప్రస్తుతం తమిళనాడులో "దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం" (DMDK) అనే రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభ సభ్యుడిగా పని చేశారు. ఆయన ప్రతిపక్ష నేతగా తమిళనాడు శాసనసభ 2011 నుండి 2016 రాజకీయాలలో ఉన్నారు.
విజయకాంత్ ఆగస్టు 12, 1952న మధురై లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు కెఎన్ అళగర్ స్వామి, ఆండాళ్ అజరగస్వామి. 31 జనవరి 1990 న ప్రేమలతను వివాహం చేసుకున్నాడు. విజయ ప్రభాకరన్, సినీ నటుడు షణ్ముగ పాండియన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు .
మొదటి చిత్రం ఎంఏ కాజా "ఇనిక్కుమ్ ఇళమై" (1979) ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన మొదటి చిత్రంలో విలన్ గా నటించారు. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన "సత్తం ఒరు ఇరుత్తరాయ్" (1981) తో మొదటి సక్సెస్ ను సాధించాడు. 100వ చిత్రం తర్వాత ఆయనను "కెప్టెన్" అని పిలవడం మొదలు పెట్టారు. ఒకానొక సమయంలో ఒకే ఏడాది 18 సినిమాలను విడుదల చేసి తన పేరు మీద ఇండస్ట్రీలో సరికొత్త హిస్టరీ లిఖించుకున్నారు.ఈ రికార్డును ఇంతవరకూ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. ఇక ఆయన నటించిన వందల సినిమాలకు ఎన్నో అవార్డులు, మరెన్నో గౌరవాలు. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే "కలైలామణి" కూడా ఆయనను వరించింది.
ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగు, హిందీలోకి డబ్ చేశారు. విజయకాంత్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో "పురట్చి కలైంజర్" (విప్లవ కళాకారుడు) అనే బిరుదు కూడా ఉంది. ఆయన చిత్రాలలో దేశభక్తి, డ్యూయల్ రోల్ యాక్టింగ్‌గా తరచూ కన్పించేవి. అతను పోలీసు అధికారిగా 20కి పైగా చిత్రాలలో నటించారు. ప్రస్తుతం సినిమాలను వదిలేసి రాజకీయాల్లో కొనసాగుతున్న విజయకాంత్ కు ఇండియా హెరాల్డ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: