హోలీ రంగుల నుంచి మీ జుట్టును, చర్మాన్ని కాపాడుకోవడం ఎలానో తెలుసా..?
ఇంకొక రెండు రోజుల్లో హోలీ పండుగ మొదలవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ హోలీ పండుగ కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే హోలీ రంగులతో ఆడడానికి ఎంతో సరదాగా ఉంటుంది. ఆడుతున్నంత సేపు చాలా సరదాగా, ఆనందం గా ఉంటుంది. కానీ హోలీ ఆట ముగిసిన తర్వాతే అసలు తిప్పలేంటో మొదలవుతుంది. హోలీ రంగోలి లో కలిపే రసాయనాల కారణంగా జుట్టుకు, చర్మానికి అంటుకొని పలు సమస్యలు ఎదురవుతాయి. ఈ రంగు అంటుకున్న తర్వాత వదిలి పోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ కారణంగా కొంతమంది బయటకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే హోలీ రంగుల నుంచి మన జుట్టుని,చర్మాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
మీరు హోలీ ఆడేటప్పుడు తలలో చుండ్రు కనుక వుంటే జుట్టుకు,తలకు హెయిర్ క్యాప్ ధరించాలి. ముక్కులోకి, కళ్ళల్లోకి పొడి రంగులు వెళ్ళకుండా కళ్లకు సన్ గ్లాసెస్, ముక్కుకు, నోటికి మాస్కు ధరించాలి.. మీ చర్మానికి రంగును తగలకుండా పూర్తిగా కప్పి వుంచే వస్త్రాలు ధరించాలి. మీ చర్మం పై దద్దుర్లు, అలర్జీలు కనుక ఉన్నట్లయితే హోలీ ముందురోజు వైద్యుని తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుంది. రంగులు చర్మానికి అంటుకోకుండా ఉండాలంటే మీ చర్మానికి తగినంత కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి డైరెక్టుగా రంగులు తగలకుండా మధ్యలో నూనె అడ్డుపడుతుంది..
అంతేకాకుండా విషపూరితం కలిగిన రంగుల్ని ఎంచుకోవడం పూర్తిగా మానేయాలి. సహజసిద్ధంగా ఏర్పడిన రంగులను మాత్రమే హోలీ ఉత్సవాల్లో ఎంచుకోవడం ఉత్తమం.. హోలీ ఆడిన తర్వాత వీలైనంత త్వరగా మీ చర్మానికి, జుట్టుకి అంటుకున్న రంగులను త్వరగా శుభ్రం చేసుకోండి.. రంగులు తడిగా ఉన్నప్పుడే కడిగితే మంచిది. ఒకవేళ పొడి రంగులు చర్మానికి అంటుకొని వదలకపోతే, ఆలివ్ ఆయిల్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి, రంగు ఉన్న ప్రదేశంలో మర్దనా చేసి, ఒక గంట సేపు ఆగాలి. ఆ తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇక చర్మానికి సబ్బులు, జుట్టుకి మంచి షాంపూలు ఉపయోగించి, రంగు అంటుకున్న ప్రదేశంలో రుద్దడం వల్ల రంగులను వదిలించుకోవచ్చు. ఆ తర్వాత చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి... ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే హోలీని ఎంతో సంబరంగా జరుపుకోవచ్చు..