జపాన్ దేశానికి చెందిన ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త హైబ్రిడ్ ఎస్యూవీ "టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్" అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడి చేసింది.ప్రత్యర్థి మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరలను వెల్లడి చేసిన రెండు రోజులకే టొయోటా తమ హైరైడర్ వేరియంట్ల ధరలను వెల్లడి చేసింది.నిజానికి మారుతి సుజుకి కంటే ముందే టొయోటా తమ హైబ్రిడ్ కారు ధరలను వెల్లడి చేసింది. అయితే, ఆ సమయంలో కొన్ని వేరియంట్ల ధరలను మాత్రమే టొయోటా వెల్లడి చేసింది. కాగా, ఇప్పుడు మారుతి సుజుకి తమ గ్రాండ్ విటారా అన్ని వేరియంట్లను వెల్లడించిన తర్వాత, టొయోటా కూడా హైరైడర్ అన్ని వేరియంట్ల ధరలను వెల్లడి చేసింది. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ బేస్ వేరియంట్ (ఇ, మైల్డ్-హైబ్రిడ్) ధరలు మొత్తం రూ.10.48 లక్షలుగా ఉన్నాయి. హైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో కూడిన గ్రాండ్ విటారా టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.17.05 లక్షలు (ఆల్ఫా వేరియంట్, డ్యూయెల్ టోన్) కాగా, ఇదే సెటప్‌తో కూడిన హైరైడర్ టాప్-ఎండ్ వేరియంట్ (వి, మైల్డ్-హైబ్రిడ్, ఆల్ వీల్ డ్రైవ్) ధర రూ.17.19 లక్షలుగా ఉన్నాయి.
టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ E, S, G మరియు v అనే ట్రిమ్‌లలో మైల్డ్-హైబ్రిడ్ సెటప్‌తో లభిస్తుంది. ఈ వేరియంట్ల ధరలు రూ.10.48 లక్షల నుండి రూ.17.19 లక్షల మధ్యలో ఉన్నాయి. కాగా, స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్ S, G ఇంకా అలాగే v అనే మూడు ట్రిమ్‌లలో మాత్రమే లభిస్తుంది. వీటి ధరలు రూ.15.11 లక్షల నుండి రూ.18.99 లక్షల మధ్యలో ఉన్నాయి.ఈ కారులో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్ మొదలైనవి ఉన్నాయి.ఇక సేఫ్టీ విషయానికి వస్తే, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ హోల్డ్ ఇంకా హిల్ డిసెండ్ కంట్రోల్ అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మొదలైనవి ఉన్నాయి.