సమాజమా... మహిళ ఇలా ఉండడమే సబబా ?

VAMSI
మారుతున్న ప్రపంచంలో మన అలవాట్లు, పద్దతులు, జీవన శైలి ఇలా ఎన్నో మార్పులు జరిగాయి. టెక్నాలజీ పెరిగింది. ప్రపంచం ఎంతగానో అభివృద్ధి చెందింది. కాలంతో పరుగులు తీస్తున్న జనాల నడవడిక కట్టు, బొట్టు ఇలా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడుతున్నారు. తమ ఉనికిని చాటుతూ అన్ని రంగాలలోను విజయ కేతనం ఎగురవేస్తున్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్ధికంగాను తమ సత్తా చాటుతున్నారు. కానీ నేటికి ఆడవారంటే ఈ సమాజంలో ఎంతో కొంత చిన్న చూపు ఉంది. కొందరి వ్యక్తుల స్వభావం కారణంగా ఈ తారతమ్యం ఏర్పడుతోంది. చాలా మంది ఆడవారికి నేటికి అందాల్సిన గౌరవం, ఆదరణ, ప్రేమ దక్కడం లేదు. దీనికి మరెవరో కారణం కాదు.  మనతో పాటు జీవిస్తున్న కొందరు వ్యక్తులే. ఆధునిక కాలంలోని మగువలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుండడం దుదృష్టకర విషయం. అంతే కాదు చాలా మంది మహిళలు నేటికి ఎన్నో రకాలుగా అవమానాలను ఎదుర్కొంటున్నారు.  

అందంగా ఉంటే అనుమానిస్తారు. అందంగా లేకపోతే అసహ్యించుకుంటారు.  చదువుకుంటే మీకు అంత చదువులు ఎందుకు అంటారు. చదువు లేకపోతే మొద్దు అని అంటారు.  కలుపుగోలుగా ఉంటే ఈ విచ్చలవిడితనం ఏంటి అంటూ ప్రశ్నిస్తారు. మౌనంగా ఉంటే ముంగిసతో పోలుస్తారు. హాయిగా నవ్వితే సమయం, సందర్భం లేదా అంటారు. ఏడిస్తే ఆడవారు అంతే ఏడుపు గొట్టు మొహాలు అంటూ తిడుతారు. కట్నం తెస్తే అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. కట్నం తీసుకురాకపోతే పనిమనిషి కన్నా దారుణంగా చూస్తారు. ఇంట్లోనే ఉంటే బానిసలా చూస్తారు . బయట ఏదో ఒక పని కోసం వెళితే ఊళ్లు తిరుగుతోంది తిరుగుబోతు అని వెక్కిరిస్తారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆడపిల్ల దేవత అంటూ కొటేషన్ లతో ప్రేమను కురిపిస్తారు.

అదే ఆడపిల్ల వారి ఇంట్లో ఉంటే భారంగా చూస్తారు. అందరూ ఇలాగే ఆడవారిని ట్రీట్ చేస్తున్నారని చెప్పలేము. కానీ మహిళలకు గౌరవం ఇచ్చే మంచి వారు ఎలా అయితే ఉన్నారో అదే మహిళలను వెక్కిరిస్తూ తక్కువగా చూసే వ్యక్తులు కూడా ఇదే సమాజంలో మనతో కలిసే ఉన్నారు.  ఇప్పటికైనా అటువంటి వారిలో మార్పు రావాలని ఆశిస్తున్నాము. మగువలు ఇటువంటి అనవసరపు వాటికి భయపడకుండా లొంగిపోయి ఆగిపోకుండా దైర్యం గా  ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. మహిళల విలువను గుర్తించండి. వారిని ప్రోత్సహించి ముందుకు సగనివ్వంది. అప్పుడు ఈ సమాజంలో అసలైన మార్పును నిజమైన అభివృద్ధిని పూర్తి స్థాయిలో చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: