కరువైపోతున్న మానవ బంధాలను కాపాడడంలో మహిళ పాత్రే కీలకం...

VAMSI
మనిషి మనుగడకు గాలి, నీరు, నివాసం వంటివి ఎలా అవసరమో మానవ సంబంధాలు కూడా అంతే అవసరం. కానీ ఈ విషయాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. సులువుగా తీసుకుంటున్నారు. అవసరం ఉంటే తప్ప బంధువులను పలకరించడం గగనంగా మారుతోంది. పండక్కో, పబ్బానికో కూడా ఇంటికి ఆహ్వానించడం మానేస్తున్నారు. "ఎవరికి వారు యమునా తీరే" అన్నట్లుగా అయిపోతుంది ప్రపంచం. బంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు మెల్లగా కనుమరుగైపోతున్నాయి. ఇంకొన్నాళ్ళు పోతే ఈ పదాలను డిక్షనరీలో వెతకాల్సి వస్తుందేమో అన్నట్లు ఉంది పరిస్థితి. ఎవరికి వారు ఇలా అందరితో మనకేం పనిలే, మనం మన భార్య పిల్లలు బాగుంటే చాలు, మన మధ్య ప్రేమానుబంధాలు ఉంటే చాలు అనుకుంటున్నారు.
కానీ రానున్న ప్రమాదాన్ని మాత్రం ఎవరు గుర్తించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దయ, ప్రేమ, జాలి, గౌరవం,
ఆదరణ అన్న భావాలు పిల్లలో కనుమరుగై పోతాయి. ఒక్క ఇంట్లో వారిని తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని భావించడం కొనసాగిస్తారు. ఆ ఆలోచనలు వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. నేటి పిల్లలే రేపటి సమాజం, కాబట్టి సమాజం మొత్తం అలాగే  తయారవుతుంది. అన్యాయాలు, అధర్మాలు, రాక్షసత్వం, దుర్మార్గం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పటి నుండే రేపటి మంచి సమాజం కొరకు మానవుని మనుగడ కొరకు మనలో మార్పును తీసుకొద్దాం, బంధాలు బాంధవ్యాలను పెంపొందించు కుందాం.
అయితే ఇక్కడ మహిళల పాత్రే ఎక్కువగా ఉంటుంది. బంధువుల నైనా, ఇరుగు పొరుగు వారైనా కలుపుకోవాలన్నా, దూరం పెట్టాలన్నా ఎక్కువగా అది ఇంట్లో మహిళపైనే ఆధారపడి ఉంటుంది. మహిళలతో పోలిస్తే మగవారికి కాస్త సెంటిమెంట్స్ తక్కువ, అలాగే సహనం, కలుపుగోలుతనం కూడా తక్కువనే చెప్పాలి. అందుకే బంధాలు బాంధవ్యాలు విషయంలో మహిళలే కాస్త ఎక్కువ చొరవ తీసుకుని కలుపుకోవాల్సి ఉంటుంది, సాన్నిహిత్యం పెంచుకోవాలి. కష్టమైనా సుఖమైనా మనకంటూ నలుగురు ఉండడం ఎంతైనా ముఖ్యం.  అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దలు. కుటుంబాన్ని అన్ని విధాలుగా చక్కబెట్టుగోగల నేర్పు మహిళల సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: