అమ్మ: గర్భిణుల ఆనందమే పిల్లల ఆరోగ్యం..!?

N.ANJI
బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ కలలు కంటుంది. మహిళ గర్భం దాల్చిందనే వార్త తెలియగానే అటు పుట్టింట్లో... ఇటు మెట్టింట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అయితే గర్భవతి అని తెలిసిన క్షణం నుంచి పుట్టబోయే బిడ్డను గూర్చి ఎన్నో ఆశలు పెట్టుకుంది. గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణులు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వారు తీసుకునే ఆహారాన్ని బట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మరి గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే కదా... ఆరోగ్యవంతమైన పిల్లలు జన్మిస్తారు.
అయితే గర్భంతో ఉన్న సమయంలో తల్లులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే దాని ప్రభావం వల్ల వారికి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. నిజానికి గర్భంతో ఉన్న సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలని, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవన విధానంలో గర్భంతో ఉండే తల్లులు తీవ్ర ఒత్తిడిని, ఆదుర్దాను ఎదుర్కొనాల్సి వస్తోంది.
ఇక దీని ఫలితంగా పిల్లలకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు ఆదుర్దా, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలతో సతమతమవుతుంటే అలాంటి వారికి పుట్టే పిల్లల్లో ప్రవర్తనా సంబంధమైన సమస్యలు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు.ఇలాంటి తల్లులకు పుట్టే పిల్లలు సుమారు పద్దెనిమిది నెలల వయసులో ఉన్నప్పటినుండే వారికి సమస్యలు మొదలవుతాయని, పిల్లలతోబాటు ఈ సమస్యలు కూడా పెరుగుతుంటాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
అయితే కౌమార దశకు వచ్చేసరికి వారిలో కూడా కుంగుబాటు ధోరణులు స్పష్టంగా కనిపిస్తాయని, కాబట్టి గర్భంతో ఉన్న తల్లులు మానసిక సమస్యలను వెంటనే గుర్తించి వాటికి తగు చికిత్సను చేయాల్సిన అవసరం ఉందని, లేని పరిస్థితుల్లో వారికి పుట్టే పిల్లల్లో కనిపించే తేడాను తొలిదశలోనే గుర్తించి దానికి అనుగుణంగా చికిత్సను అందించడం ద్వారా నివారణ చర్యలను చేపట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: